Site icon HashtagU Telugu

TS High Court : బీసీ కుల గణనపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

telangana-high-court-fires-at-government-over-dog-bite

Telangana High Court

Telangana High Court on BC caste census: తెలంగాణ హైకోర్టు బీసీ కుల గణనపై కీలక ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల్లో బీసీ కుల గణన పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. బీసీ కులగణన చేయాలని హైకోర్టులో 2019లో బీసీ సంఘం నేత ఎర్ర సత్యనారాయణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను మంగళవారం సీజే ధర్మాసనం విచారించింది. బీసీ కుల గణనపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని పేర్కొన్న పిటిషనర్ తరపున నాగుల శ్రీనివాస్ యాదవ్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ కులగణన చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కోర్టుకు తెలిపారు. దీంతో మూడు నెలల్లో బీసీ కులగణన చేయాలని ప్రభుత్వానికి ఆదేశించిన హైకోర్టు.. ఈ పిటిషన్ పై విచారణ ముగిసిటన్లు ప్రకటించింది.

నలుగురు సభ్యులతో బీసీ కమిషన్‌ ఏర్పాటు..

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల సీనియర్ నేత నిరంజన్ చైర్మన్ గా నలుగురు సభ్యులతో బీసీ కమిషన్ ను ఏర్పాటు చేసింది. కులగణన చేపడతామని బాధ్యతల స్వీకరణ సమయంలో చైర్మన్ ప్రకటించారు. దీంతో ప్రభుత్వం సైతం బీసీ కులగణనకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. స్థానిక ఎన్నికల తర్వాతనా? లేక ఇప్పుడా? అన్న విషయంలోనే క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుత హైకోర్టు తీర్పు నేపథ్యంలో కులగణన తర్వాతనే ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. మరికొన్ని రోజుల్లో ఈ అంశంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి..

తెలంగాణలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనేదే దానిపై చర్చ జోరుగా జరుగుతోంది. ఇప్పటికే సర్పంచుల పదవి కాలం ముగిసిన ఇంకా ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ ను ప్రభుత్వం ప్రకటించలేదు. కాగా కులగణన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తో సహా పలువురు కీలక నేతలు ఇప్పటికే ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే, స్థానిక సంస్థలు ఎన్నికలు వెంటనే జరపాలని ప్రభుత్వాన్ని ప్రతిపక్షాల నుంచి ప్రభుత్వానికి ఒత్తిడి వస్తోంది. అయితే, దసరా తరువాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా హైకోర్టు కూడా బీసీ కులగణనపై ఆదేశాలు ఇవ్వడంతో దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Read Also: WTC Points Table: శ్రీలంకపై ఇంగ్లండ్ ఓట‌మి.. WTC పాయింట్ల ప‌ట్టిక‌లో మార్పులు..!