KCR : రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణలో కీలక మలుపు తలెత్తింది. బీఆర్కే భవన్‌లో న్యాయ విచారణ కమిషన్ ఎదుట భారతీయ రాష్ట్ర సమితి అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) విచారణ ముగిసింది. సుమారు 50 నిమిషాల పాటు జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ కేసీఆర్‌ను ప్రశ్నించింది. ఆయనను 115వ సాక్షిగా విచారించడం గమనార్హం. విచారణలో భాగంగా కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన, నిర్మాణ తీరుపై వివిధ ప్రశ్నలు సంధించింది. ప్రాజెక్టు ఆరంభం నుంచి తీసుకున్న కీలక నిర్ణయాలు, బ్యారేజీల నిర్మాణ సమయంలో ఎదురైన సాంకేతిక సమస్యలు, వాటికి అందించిన పరిష్కారాలు, నిధుల వినియోగం వంటి అంశాలపై సమగ్రంగా వివరణ కోరింది. విచారణ అనంతరం కేసీఆర్ బీఆర్కే భవన్ ఎదుట వేచి ఉన్న అభిమానులు, పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ కారులో బయటకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కూడా ఉన్నారు.
Read Also: Pakistan : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్..రక్షణ బడ్జెట్ భారీగా పెంచిన పాక్..!
కమిషన్ గత కొన్ని నెలలుగా విచారణను వేగంగా కొనసాగిస్తోంది. ఇప్పటికే పలు శాఖల అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు విచారణకు హాజరైపు, అఫిడవిట్లు సమర్పించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన సీపేజ్ సమస్యలపై ప్రాజెక్టు నాణ్యతపై అనేక అనుమానాలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో 2024 మార్చిలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో న్యాయ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్ ఇప్పటివరకు నీటిపారుదల, ఆర్థిక శాఖలతో పాటు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగాలకు చెందిన అధికారులను విచారించి, వారి నుండి వివరాలు సేకరించింది. అదే సమయంలో నిర్మాణ సంస్థల ప్రతినిధుల నుంచి అఫిడవిట్లు తీసుకొని, అవసరమైన సందర్భాల్లో వారిని క్రాస్ ఎగ్జామినేషన్‌కు కూడా పిలిపించింది.
ఇటీవలే కమిషన్ మాజీ మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావులను కూడా విచారించింది. తాజా పరిణామంలో కేసీఆర్ విచారణ పూర్తవడం కీలకమైన దశగా మారింది. విచారణ తీరును బట్టి, కమిషన్ తుది నివేదిక కోసం వేచి చూడాల్సిందే. రాష్ట్ర ప్రాజెక్టులపై ప్రజాధనం వినియోగంపై పారదర్శకత, బాధ్యతాయుతమైన పాలనకు ఇది ఒక ఉదాహరణగా నిలవనుంది. ఈ విచారణలో వచ్చిన ఫలితాలు, తుది నివేదిక ఎలా ఉండబోతుందన్నదే ప్రస్తుతం రాజకీయ, సామాజిక వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. ఇక, ఈ రోజు ఉదయం 11 గంటలకు బీఆర్కే భవన్‌లో జరిగే పీసీ ఘోష్ విచారణకు కేసీఆర్ హాజరయ్యారు. ఆయన్ని కమిటీ హాల్‌లోకి తీసుకెళ్తే తనకు వేరుగా విచారించాలని రిక్వస్ట్ చేశారు కేసీఆర్. ఆయన అభ్యర్థనను ఘోష్ అంగీకరించారు. మిగతా నాయకులను బయటకు పంపేశారు. కేసీఆర్‌ను ఓ రూమ్‌లో ఉంచి ప్రశ్నలు అడిగినట్టు సమాచారం అందుతోంది.
Read Also: Barla Srinivas : మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత బహిష్కరణ