Aarya : ప్రముఖ కోలీవుడ్ నటుడు ఆర్య (Aarya) నివాసంలో బుధవారం ఉదయం ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. చెన్నైలోని అన్నానగర్‌లో ఉన్న ఆయన నివాసంతో పాటు, ఆయన్ను సంబంధించి ఉన్నట్లు భావిస్తున్న “సీ షెల్” రెస్టారెంట్ చైన్ కు చెందిన పలు బ్రాంచులపై కూడా అధికారులు సమాంతరంగా దాడులు చేపట్టారు. ఈ దాడులు పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో జరుగుతున్నట్లు సమాచారం. కొంతకాలంగా ఆర్య వ్యాపార లావాదేవీలపై విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా సీ షెల్ రెస్టారెంట్‌ల ద్వారా భారీగా ఆదాయం రావడం, కానీ దానికి తగిన విధంగా పన్నులు చెల్లించకపోవడం గురించి అధికారులు అనుమానాలు వ్యక్తం చేసినట్లు వార్తల ద్వారా తెలుస్తోంది.
Read Also: Narendra Modi : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సవాళ్లపై ప్రధాని మోదీ ఆందోళన
ఈ నేపథ్యంలో, బుధవారం తెల్లవారుజామున అధికారులు ఆర్య ఇంటిపై దాడులు మొదలుపెట్టారు. ఈ సోదాల్లో ఆయన కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బందిని అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. అలాగే, రెస్టారెంట్‌ల ఖాతాల పత్రాలు, లావాదేవీల వివరాలు, బ్యాంకు రికార్డులు వంటి అనేక కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై ఆర్య స్పందించారు. చెన్నైలో మీడియాతో మాట్లాడిన ఆయన సీ షెల్ రెస్టారెంట్ వ్యాపారంతో నాకు ప్రస్తుతం ఎటువంటి సంబంధం లేదు. ఆ వ్యాపారం నిర్వహణ బాధ్యతలను నేను కొన్ని సంవత్సరాల క్రితమే ఒక స్నేహితునికి అప్పగించాను. ఇప్పుడు జరుగుతున్న ఐటీ దాడుల పట్ల నేను సహకరిస్తున్నాను అని అన్నారు.
ఆయన వ్యక్తిగతంగా ఇప్పటి వరకు ఆ వ్యాపార లావాదేవీల్లో పాల్గొనలేదని, తనపై ఉన్న ఆరోపణలు నిరాధారమైనవని చెప్పారు. అయినా అధికారులు విచారణను పూర్తిగా చేయాలని ఆయన అభ్యర్థించారు. కోలీవుడ్ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు పొందిన ఆర్య, ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఆయన తాజాగా నటించిన చిత్రం విజయం సాధించడంతో పాటు, పలు కొత్త ప్రాజెక్టుల్లో కూడా పనిచేస్తున్నారు. అంతేకాకుండా, ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఈ దాడులను కొనసాగిస్తున్నారు. పూర్తి విచారణ అనంతరం అధికారులు అధికారికంగా ప్రకటన వెలువరించే అవకాశముంది. సినీ రంగంలో ఆదాయం, వ్యాపార సంబంధాలు, పన్ను వ్యవహారాల విషయంలో ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ, పలువురు ప్రముఖులు ఈ రకమైన దాడులకు గురవుతున్నారు.
Read Also: FASTag annual pass : ఫాస్టాగ్ యూజర్లకు కేంద్రం శుభవార్త