Site icon HashtagU Telugu

ISRO : శుభాంశు శుక్లా రోదసియాత్ర వాయిదాపై స్పందించిన ఇస్రో ఛైర్మన్‌

ISRO Chairman responds to postponement of Subhanshu Shukla's space mission

ISRO Chairman responds to postponement of Subhanshu Shukla's space mission

ISRO : క్రమంగా రూపుదిద్దుకుంటున్న భారత అంతరిక్ష సామర్థ్యంలో మరో కీలక ఘట్టమైన వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) రోదసి యాత్ర మరోసారి వాయిదా పడింది. అమెరికా ప్రైవేట్‌ అంతరిక్ష సంస్థ స్పేస్‌ఎక్స్‌ (SpaceX) నిర్వహిస్తున్న యాక్సియం-4 (Axiom-4) మిషన్‌లో భాగంగా బుధవారం ఆయన నింగిలోకి వెళ్లాల్సి ఉండగా, సాంకేతిక కారణాల వల్ల ప్రయోగాన్ని నిలిపివేశారు. రాకెట్‌లో లిక్విడ్‌ ఆక్సిజన్‌ లీక్‌ కనుగొనడంతో స్పేస్‌ఎక్స్‌ తాత్కాలికంగా ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు ‘ఎక్స్‌’ సామాజిక మాధ్యమ వేదికలో వెల్లడించింది. ఈ విషయం పై భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) ఛైర్మన్‌ డా. వి. నారాయణన్‌ స్పందిస్తూ, ఇది మానవ సహిత యాత్ర కావడంతో సాంకేతిక సమస్యల్ని పూర్తిగా పరిష్కరించి, ప్రయోగాన్ని అత్యంత జాగ్రత్తగా చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. స్పేస్‌ఎక్స్‌, యాక్సియం స్పేస్‌ నిపుణులతో ఇస్రో బృందం చర్చలు జరిపింది.

Read Also: Gali Janardhan Reddy : ఓఎంసీ కేసు.. గాలి జనార్దన్‌రెడ్డికి బెయిల్‌

లిక్విడ్ ఆక్సిజన్ లీక్‌ను సరిచేసిన తర్వాత, అనివార్య ధ్రువీకరణ పరీక్షలు జరపాలని నిర్ణయించాం. ఇది సురక్షిత ప్రయోగం కోసం తీసుకున్న సముచిత నిర్ణయమే అని ఆయన తెలిపారు. డా. నారాయణన్‌కు క్రయోజనిక్‌ ఇంజిన్లు, వాటిలో ఉపయోగించే అధిక శీతలీకరణ ద్రవ ఆక్సిజన్‌ నిర్వహణలో విశేష అనుభవం ఉంది. భారత్‌ అభివృద్ధి చేసిన స్వదేశీ క్రయోజనిక్‌ ఇంజిన్ల ప్రణాళికకు ఆయన ప్రధాన శిల్పిగా పనిచేశారు. ఇదే అనుభవంతో, ఈ మిషన్‌ సమయంలో కూడా ఆయన ప్రత్యక్షంగా ఫ్లోరిడా రాష్ట్రంలోని కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ (Kennedy Space Center) వద్దే ఉంటూ, ఫాల్కన్‌ 9 రాకెట్‌ ప్రయోగానికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అంతరిక్ష ప్రయోగానికి అనువైన వాతావరణం లేకపోవడం, అనంతరం సాంకేతిక లోపం వల్ల ఈ ప్రయోగం రెండు మార్లు వాయిదా పడింది. మొదట మంగళవారం ప్రయోగించాల్సిన షెడ్యూల్‌ను వాతావరణ ప్రతికూలతల కారణంగా బుధవారానికి మార్చారు. కానీ తాజాగా రాకెట్‌లో సాంకేతిక లోపం బయటపడటంతో మరోసారి ప్రయోగాన్ని వాయిదా వేశారు. కొత్త తేదీని ఇంకా ప్రకటించలేదు.

ఈ నేపథ్యంలో శుభాంశు శుక్లా ప్రయాణం ఆలస్యం కావడం, దేశ ప్రజలలో కొంత నిరాశ కలిగించినా, అంతరిక్ష ప్రయోగాల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ తీసుకున్న నిర్ణయం అప్రశంసనీయమని విశ్లేషకులు భావిస్తున్నారు. మిషన్‌ విజయవంతంగా పూర్తయ్యేందుకు ఎలాంటి సంశయాలకు తావు లేకుండా అన్ని ఏర్పాట్లు జరిగేలా చూస్తున్నట్లు ఇస్రో వర్గాలు వెల్లడించాయి. భారత వ్యోమగామిగా శుభాంశు శుక్లా నింగిలోకి వెళ్లడం సగర్వకారణంగా ఉండబోతోంది. ఇందుకోసం దేశం మొత్తం ఎదురు చూస్తోంది. ఆయన ప్రయోగం విజయవంతంగా పూర్తవాలని కోరుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు.

Read Also: Mangli Birthday Party: మంగ్లీ బ‌ర్త్ డే పార్టీలో గంజాయి క‌ల‌క‌లం.. సినీ ప్ర‌ముఖులు అరెస్ట్‌?