Israel: ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల్లో ఒకటి టెల్‌అవీవ్‌లో ఉన్న అమెరికా దౌత్య కార్యాలయాన్ని తాకింది. ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. దాడిలో కార్యాలయం స్వల్పంగా దెబ్బతినగా, సిబ్బందికి ఎటువంటి గాయాలు కలగలేదని అమెరికా దౌత్యవేత్త మైక్ హకేబీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో టెల్‌అవీవ్, జెరూసలెంలోని దౌత్య కార్యాలయాలు తాత్కాలికంగా మూసివేసినట్లు ఆయన ‘ఎక్స్’ ద్వారా తెలిపారు. ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరిన వేళ, ఈ దాడులు తీవ్ర ఆందోళనకు కారణమయ్యాయి. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాల్ ఖట్జ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ మా పౌరులపై దాడులు చేస్తే, టెహ్రాన్ నగర ప్రజలే దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది అని ఆయన హెచ్చరించారు. ఇటీవల టెహ్రాన్‌పై జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఐదుగురు మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు. ఈ దాడిని ఖట్జ్ ఖమేనీపై నేరుగా నిగ్గు తేల్చారు.
Read Also: PM Modi : డిజిటల్ లావాదేవీల్లో 50 శాతం యూపీఐ ద్వారానే: ప్రధాని మోడీ
అహంకారంతో నిండిన ఆ నియంత ఇప్పుడు హంతకుడిగా మారాడు. ఉద్దేశపూర్వకంగా మాకు భయం కలిగించేందుకు, పౌరుల నివాసాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నాడు అని ఆయన తన టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ రక్షణ శాఖ మరో కీలక హెచ్చరికను జారీ చేసింది. టెహ్రాన్ నగరంలోని ఆయుధ తయారీ కేంద్రాల సమీపంలో నివసించే పౌరులు తక్షణమే ఆ ప్రాంతాలను ఖాళీ చేయాలని హెచ్చరించింది. ఇటువంటి చర్యల ద్వారా ఇరాన్‌కు గట్టి బుద్ధి చెబుతామని స్పష్టం చేసింది. ఇక ఇజ్రాయెల్ చేపట్టిన ప్రతిదాడుల్లో టెల్‌అవీవ్ ఫైటర్ జెట్లు ఇరాన్ ఐఆర్‌జీసీకి చెందిన ఖుద్స్ ఫోర్స్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ దళం ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా అనేక రహస్య ఆపరేషన్లను నిర్వహించిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ప్రతినిధి తెలిపారు.
ఇరాన్ జరిపిన మరో క్షిపణి దాడిలో సెంట్రల్ ఇజ్రాయెల్‌లోని విద్యుత్ సరఫరా వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం పడింది. పవర్ గ్రిడ్ దెబ్బతిన్నట్లు ఇజ్రాయెల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ ధృవీకరించింది. అయితే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణమే మార్గాలు వెతుకుతున్నామని, విద్యుత్ సరఫరాను త్వరలోనే పునరుద్ధరిస్తామని అధికారులు ప్రకటించారు. ఇక హైఫా ఓడరేవు నగరాన్ని కూడా లక్ష్యంగా చేసుకొని ఇరాన్ వరుస దాడులు జరుపుతోంది. తాజాగా అక్కడ చమురు నిల్వలు, రిఫైనరీలు, ఇతర వ్యూహాత్మక భవనాలపై క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడులు తెల్లవారుజామున జరగగా, భారీ నష్టం జరిగినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు అత్యంత ప్రమాదకర దశకు చేరుకున్నాయి. ఈ పరిణామాలు అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనకు దారితీశాయి. యుద్ధ భయంతో ప్రాంతం మొత్తంలో అలజడి నెలకొంది.
Read Also: RajaSaab Teaser : రాజాసాబ్ టీజర్ మామూలుగా లేదుగా.