Pakistan : సింధూ జలాలపై మరోసారి కఠిన స్వరంతో పాకిస్థాన్ సైన్యాధిపతి అసీం మునీర్ స్పందించారు. సింధూ జలాలు పాకిస్తాన్‌కు రెడ్‌లైన్. దీనిపై ఎలాంటి రాజీకి అవకాశం లేదు. ఇది పాకిస్తాన్‌లోని 24 కోట్ల పౌరుల ప్రాథమిక హక్కు అని ఆయన ప్రకటించారు. పాక్‌లోని వివిధ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, ప్రధాన అధ్యాపకులు, సీనియర్ విద్యావేత్తల సమూహానికి జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌పై ఎలాంటి ఒప్పందాలు సాధ్యపడవు. అది మాకు మరపురాని హక్కు. మన తరం బాధ్యత, పాకిస్తాన్ గాథను భవిష్యత్ తరాలకు అందించడం. విద్యార్థుల వ్యక్తిత్వాన్ని మలచడం మీ అందరి బాధ్యత. బలోచ్ విప్లవ భావాలు దేశవాళి ఉద్యమం కావు, అవి పూర్తిగా విదేశీ శక్తుల ప్రభావం అని మునీర్ ఆరోపించారు.
Read Also: United Nations : ఆర్థిక ఇబ్బందులో ఐక్యరాజ్యసమితి..7 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు యోచన..!
అయితే, ఆయన గత వ్యాఖ్యలే ఇటీవల జరిగిన పహల్గాం ఉగ్రదాడికి కారణమయ్యాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. “కశ్మీర్ జీవనాడి”గా ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో భారత్‌పై జరిగిన ఈ దాడి, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు భారతీయ భద్రతా వర్గాలను అప్రమత్తం చేశాయి. ఈ ఘటనల నేపథ్యంలో భారత్ తొలిసారి 1960లో కుదిరిన ఇండస్ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది. ఈ ఒప్పందం తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. పాకిస్తాన్‌లోని పలువురు ఉగ్రస్థావరాలపై భారత్ జరిపిన ప్రతీకార దాడుల్లో ఎనిమిది పైగా స్థావరాలు తీవ్రంగా నాశనం అయ్యాయని సమాచారం. పాక్ సైన్యంలోనూ గణనీయమైన నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఇండస్ జలాల ఒప్పందం చరిత్రలోకి వెళితే, ఇది 1960 సెప్టెంబరులో అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ మధ్య కుదిరింది. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో ఈ ఒప్పందం రూపొందింది.
ఒప్పందం ప్రకారం, తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్‌పై భారత్‌కు హక్కులు లభించగా, పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్‌లపై పాకిస్తాన్‌కు హక్కులు ఉన్నాయి. ఈ జలాల వార్షిక ప్రవాహం అంచనాల ప్రకారం, తూర్పు నదులు సగటున 33 మిలియన్ ఎకర్ అడుగులు (MAF) అందిస్తే, పశ్చిమ నదులు 135 MAF అందిస్తున్నాయి. ఈ మౌలిక ఒప్పందాన్ని భారత్ సస్పెండ్ చేయడమే తొలి సందర్భం కావడంతో పాకిస్తాన్ నేతల్లో తీవ్ర అసంతృప్తి చెలరేగింది. ఇప్పుడు మునీర్ వ్యాఖ్యలు, పాకిస్తాన్ ఆర్మీతో పాటు రాజకీయ నేతల వైఖరిని ప్రతిబింబిస్తున్నాయి. భారత్ తీసుకున్న చర్యలపై విమర్శలతో పాటు తమ జలాధికారం గౌరవించాలంటూ పాకిస్తాన్ మరోసారి అంతర్జాతీయ వేదికలను ఆశ్రయించనుంది.
Read Also: AP Liquor Scam : ఏపీ మద్యం కుంభకోణం కేసు.. సిట్ కస్టడీకి నలుగురు కీలక నిందితులు