Site icon HashtagU Telugu

Parliament : గోడలు ఎక్కి నిరసన తెలుపుతున్న కూటమి ఎంపీలు

INDIA Alliance MPs Protest on Walls of Makar Dwar at Parliament

INDIA Alliance MPs Protest on Walls of Makar Dwar at Parliament

Parliament : కేంద్ర మంత్రి అమిత్ షా బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ను అవమానించేలా మాట్లాడారని ఆయన వేంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష ఇండి కూటమి ఎంపీలు ఆందోళనకు దిగారు. అంబేద్కర్ చిత్రపటాలతోపాటు ప్లకార్డులు పట్టుకుని వారంతా అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్లమెంట్ వద్ద ప్లకార్డులతో మకరద్వార్ గోడలు ఎక్కి విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక, ఇతర ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని అంబేద్కర్‌ విగ్రహం వద్దకు వెళ్లి ఆందోళన నిర్వహించారు. జై భీమ్ అంటూ నినాదాలు చేశారు.

మరోవైపు, బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏ ఎంపీలు సైతం ప్లకార్డులు పట్టుకుని అంబేద్కర్‌ను అవమానించిన కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని నిరసన తెలిపారు. అంబేద్కర్‌ను అవమానించడం తగదని నినాదాలు చేశారు. కాంగ్రెస్ ఎప్పుడూ అంబేద్కర్‌ను గౌరవించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వారంతా బిగ్గరగా నినాదాలు చేశారు. ఈ నిరసనలతో పార్లమెంట్ ఆవరణ దద్దరిల్లింది. ఇక లోక్ సభ ప్రారంభమైంది. సభలోని ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు అమిత్ షా క్షమాపణలు చెప్పాలంటూ నిరసనలు చేపట్టారు. దీంతో లోక్ సభను మధ్యాహ్నం 2.00 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.

ఇకపోతే.. అధికారం పక్షం ఎంపీలను ప్రతిపక్షాలు అడ్డుకునే సమయంలో ఒడిశా బీజేపీ ఎంపీ ప్రతాప్‌ చంద్ర సారంగికి గాయమైంది. ఒక ఎంపీని రాహుల్‌గాంధీ నెట్టారని, ఆ ఎంపీ తనపై పడడం వల్ల కింద పడ్డానని సారంగి చెప్పారు. అప్పుడు మెట్ల వద్ద ఉన్న తాను కిందపడినట్లు సారంగి చెప్పారు. ఆయన తలపై గాయం కాగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే సారంగి ఆరోపణలను రాహుల్ గాంధీ తోసిపుచ్చారు. తాను పార్లమెంటు లోపలికి వెళ్తుంటే బీజేపీ ఎంపీలే తమను అడ్డుకుని నెట్టేశారని, బెదిరించారని రాహుల్ చెప్పారు. మల్లికార్జున ఖర్గేను కూడా తోసివేశారని ఆ సమయంలోనే ఈ ఘటన జరిగిందన్నారు. ఇదంతా కెమెరాల్లో నిక్షిప్తమై ఉంటుందన్నారు.

Read Also: AP High Court: ఏపీలో వాహనదారులకు షాక్.. ఇకపై ఆ వాహనాలు సీజ్?