Census : ‘జన గణన’కు గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన హోంశాఖ

ఈ భారీ గణాంక ప్రక్రియను రెండు దశలుగా చేపట్టనున్నారు. పూర్తి ప్రక్రియను 2027 మార్చి 1వ తేదీ నాటికి పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈసారి జనగణనలో ప్రాధాన్యతగల మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Home Ministry issues gazette notification for 'Census'

Home Ministry issues gazette notification for 'Census'

Census : దేశంలో 15 ఏళ్ల విరామం తర్వాత ప్రతిష్ఠాత్మకమైన జనగణన ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ నెల 16వ తేదీ సోమవారం గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇది దేశానికి మొత్తంగా 16వ జనగణన కాగా, స్వాతంత్య్రానంతరం చేపట్టబోయే 8వ జనగణన కావడం విశేషం. ఈ భారీ గణాంక ప్రక్రియను రెండు దశలుగా చేపట్టనున్నారు. పూర్తి ప్రక్రియను 2027 మార్చి 1వ తేదీ నాటికి పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈసారి జనగణనలో ప్రాధాన్యతగల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సాధారణ జనాభా లెక్కలతో పాటు కుల గణనను కూడా ప్రభుత్వం ఈసారి సమాంతరంగా నిర్వహించనుంది.

Read Also: Padi kaushik Reddy : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

ఇది దేశ రాజకీయ, సామాజిక పరిణామాలపై విశేష ప్రభావం చూపనుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనగణన కోసం భారీ సంఖ్యలో మానవ వనరులను కేంద్రం వినియోగించనుంది. మొత్తం 34 లక్షల మంది గణకులు, సూపర్‌వైజర్లు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వీరిలో 1.34 లక్షల మంది ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బందిగా ఎంపికయ్యారు. ఇతర జనగణనల కంటే ఈసారి ప్రధానమైన మార్పు ఏమిటంటే మొత్తం ప్రక్రియను పూర్తిగా డిజిటల్‌ రూపంలో నిర్వహించడమే. గణకులు ట్యాబ్లెట్లను ఉపయోగించి గృహాల వద్దకు వెళ్లి సమాచారాన్ని నమోదు చేస్తారు.

అంతేకాకుండా, ప్రజలకు తామే తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక పోర్టళ్లు, మొబైల్ యాప్‌లు అందుబాటులో ఉంటాయి. డేటా భద్రత విషయంలో కేంద్రం అత్యంత జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రజల వ్యక్తిగత సమాచారం హానికరంగా వాడబడకుండా, సురక్షితంగా భద్రపరచేందుకు సాంకేతికంగా బలమైన చర్యలు తీసుకుంటున్నట్లు హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. సమాచారం సేకరణ, డేటా బదిలీ, భద్రత, నిల్వ వంటి ప్రతి దశలో కఠినమైన ప్రమాణాలను అమలు చేయనుంది. ఈసారి చేపట్టబోయే జనగణనతో ప్రభుత్వ విధానాలలో పారదర్శకత, సమర్థత మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రత్యేకించి కుల గణనతో పాటు డిజిటల్ దృక్పథంతో ఇది ప్రజా ప్రణాళికల రూపకల్పనకు కీలకంగా నిలవనుంది. అన్ని రాష్ట్రాల సహకారంతో ఈ గణాంక యజ్ఞం విజయవంతమవుతుందని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేసింది.

Read Also: AP : ఏపీ మహిళలకు శుభవార్త.. ఇకపై వారికి నెలకు రూ 1500.. !

  Last Updated: 16 Jun 2025, 12:49 PM IST