Site icon HashtagU Telugu

Padayatra : త్వరలో పాదయాత్ర చేపట్టనున్న హరీశ్‌ రావు

Harish Rao will soon undertake the padayatra

Harish Rao will soon undertake the padayatra

Padayatra : బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు త్వరలో పాదయాత్ర చేపట్టనున్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టుల పనులను పూర్తి చేయాలనే డిమాండ్‌తో, ఆ ప్రాజెక్టుల నిర్దేశిత ఆయకట్టు ప్రాంతాల్లో ఆయన ఈ యాత్ర చేపడుతున్నారు. ఆ ప్రాజెక్టుల నిర్దేశిత ఆయకట్టు ప్రాంతాల్లో వారం రోజుల పాటు సుమారు 130 కిలోమీటర్లు హరీష్ రావు పాదయాత్ర చేయనున్నారు. ఈ క్రమంలోనే గ్రామాల్లో రోజుకో సభ నిర్వహించనున్నారు. చివరి రోజున నిర్వహించే సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారని సమాచారం. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read Also: New Pass Books : ఏపీలో ఏప్రిల్‌ 1 నుంచి కొత్త పాస్‌ పుస్తకాల పంపిణీ

మాజీ సీఎం కేసీఆర్ బయటకు వస్తే పార్టీకి మైలేజ్ పెరుగుతుందని గులాబీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ మేరకు పాదయాత్ర తేదీలను ప్రకటించనున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ త్వరలో వెలువడితే.. ఎన్నికల తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తారు. ఎన్నికలు ఏప్రిల్‌, మేలో ఉంటే.. ఈ నెలలోనే పాదయాత్ర మొదలుపెడతారు. ప్రతి రోజూ సుమారు 18 నుంచి 20 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుంది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌, అందోల్‌, సంగారెడ్డి, జహీరాబాద్‌ నియోజకవర్గాల్లో ఈ పాదయాత్ర సాగుతుంది. సర్వే పూర్తయి భూసేకరణ దశలో నిలిచిపోయిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టుల పనులను వెంటనే ప్రారంభించి జిల్లాలోని 397 గ్రామాల్లో దాదాపు 4లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని హరీశ్‌రావు కోరుతున్నారు.

కాగా, రెండేళ్ల క్రితం 2022 ఫిబ్రవరి 21న నారాయణఖేడ్‌లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఇటీవల ఎర్రవల్లిలోని ఫామ్‌హౌ్‌సలో తనను కలిసిన పార్టీ నేతలతో కేసీఆర్‌ మాట్లాడుతూ.. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఈ ప్రాజెక్టుల కోసం పోరాడదామని శ్రేణులకు సూచించారు. ఈ బాధ్యతను సీనియర్‌ నేత హరీశ్‌రావుకు అప్పగించారు. అందుకు అనుగుణంగానే హరీశ్‌రావు పాదయాత్రకు సిద్ధమయ్యారు.

Read Also: Balakrishna : బాలయ్య ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్