FASTag annual pass : దేశవ్యాప్తంగా ప్రయాణిస్తున్న ప్రైవేట్ వాహనదారులకు శుభవార్త. జాతీయ రహదారులపై టోల్‌ప్లాజాల్లో రద్దీ తగ్గించడంతో పాటు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్‌ను తీసుకురావాలని నిర్ణయించింది. ఈ పాస్‌ను స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15, 2025 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ వార్షిక పాస్ కోసం ప్రయాణికులు రూ. 3,000 చెల్లించాల్సి ఉంటుంది. పాస్ యాక్టివేట్ అయినప్పటి నుంచి ఏడాది పాటు లేదా 200 ట్రిప్పులు పూర్తయ్యేవరకు ఈ రెండింటిలో ఏది ముందుగా సంభవిస్తే అది పాస్ చెల్లుబాటు అవుతుంది. ఇది పూర్తిగా ఫాస్టాగ్‌తో అనుసంధానించబడిన వ్యవస్థగా పనిచేస్తుందని గడ్కరీ తెలిపారు.
Read Also: CM Revanth Reddy : గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి
ఈ పాస్ ప్రధానంగా కార్లు, జీపులు, వ్యాన్లు వంటి నాన్-కమర్షియల్ వాహనాలకు మాత్రమే వర్తించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జాతీయ రహదారులపై ఈ పాస్ ఉపయోగించవచ్చు. దాని యాక్టివేషన్ కోసం ప్రత్యేకమైన లింక్‌ను త్వరలో అందుబాటులోకి తెస్తామని, ఇది రాజ్‌మార్గ్ యాప్, NHAI, మరియు MoRTH అధికారిక వెబ్‌సైట్లలో లభ్యమవుతుందని గడ్కరీ వెల్లడించారు. ఇదివరకు ప్రయాణికులు చాలాకాలంగా టోల్ ఛార్జీలపై స్థిరమైన, ప్రాక్టికల్ పరిష్కారం కోరుతున్నారు. టోల్‌ప్లాజాల వద్ద రోజూ ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యలు, క్యూలైన్లలో వాహనాలు నిలిచిపోవడం, కొన్ని సందర్భాల్లో వాహనదారులు అధికారులు మధ్య తలెత్తే వివాదాలను దృష్టిలో పెట్టుకొని, ఈ కొత్త పాస్ విధానం తీసుకువచ్చినట్లు గడ్కరీ వివరించారు.
ఈ పాస్ ద్వారా టోల్‌ప్లాజాల వద్ద వేచిచూడే సమయం గణనీయంగా తగ్గిపోతుందని, వాహనదారులకు స్నేహపూర్వకమైన ప్రయాణ అనుభవాన్ని ఇది కలిగిస్తుందని పేర్కొన్నారు. అంతేకాదు, లక్షలాది మంది ప్రైవేట్ వాహనదారులకు ఇది పెద్ద ఊరటగా మారే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది భవిష్యత్‌లో మరింత ఆధునీకరణకు దారి చూపించే విధానమని, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌లో కీలకంగా మారబోతున్న దశగా ప్రభుత్వం దీన్ని చూస్తోందని సమాచారం. ఫాస్టాగ్ ఆధారిత ఈ వార్షిక పాస్ ద్వారా దేశ వ్యాప్తంగా వాహనదారులు ఒకే విధానంలో, స్థిరమైన వ్యయంతో ప్రయాణించగలిగే అవకాశం కలుగనుంది. ఇది డిజిటల్ ఇండియా దిశగా మరో ముందడుగుగా నిలిచే అవకాశం ఉంది.
Read Also: Murder : గోవాలో ప్రేమజంట విషాదాంతం.. ప్రేయసిని గొంతుకోసి