Extends Green Card Validity: అమెరికాలో శాశ్వత నివాసం పొందుతున్న గ్రీన్ కార్డు దారులకు అక్కడి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పర్మనెంట్ రెసిడెంట్ కార్డుల వ్యాలిడిటీ కాలాన్ని పొడగించింది. గతంలో గ్రీన్ కార్డు గడువు ముగిసినప్పటికీ.. మరో 24 నెలల పాటు దాని వ్యాలిడిటీని పెంచేవారు. కానీ ప్రస్తుతం దీనిని 36 నెలల వరకు పెంచినట్టు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ వెల్లడించింది.
Read Also: Hyderabad: హైదరాబాదులో రెండ్రోజుల పాటు నీటి సరఫరా బంద్
గ్రీన్ కార్డు రెన్యువల్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఊరట లభించినట్టు అయింది. సాధారణంగా అమెరికాలో గ్రీన్ కార్డులు పొందిన వారు పదేళ్లకొకసారి రెన్యువల్ చేయించుకోవాల్సి ఉండేది. ఇందుకోసం కార్డు గడువు తీరిపోయే కాలానికి ఆరునెలల ముందే ఐ-90 ఫామ్ ను సమర్పించాలని ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కార్డు వ్యాలిడిటీని 24 నెలల పాటు పొడగిస్తూ.. రిసీట్ నోటీస్ అందజేస్తారు. దీంతో గ్రీన్ కార్డు గడువు ముగిసినా.. ఈ నోటీస్ తో వారికి చట్టబద్దమైన నివాస హోదా కొనసాగుతోంది. కొత్త కార్డులు జారీ అయ్యేంత వరకు ఉద్యోగాలు, ప్రయాణాల సమయాలలో వారు దానిని లీగల్ స్టేటస్ ప్రూఫ్ గా వినియోగించుకోవచ్చు. అయితే, కండిషనల్ రెసిడెన్సీ తీసుకునేవారి గ్రీన్‌కార్డుల గడువు రెండేళ్లపాటే ఉంటుంది. వీరికి తాజా పొడిగింపు వర్తించదు. వీరు ముందుగా నివాస హోదాపై ఉన్న కండీషన్స్ తొలగించుకునేందుకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. కార్డు గడువు తీరే 90 రోజుల్లోపు దీన్ని చేసుకోవాలి. దరఖాస్తు అనుమతి పొందితే.. వారికి 10ఏళ్ల కాలానికి గ్రీన్‌కార్డు లభిస్తుంది.