Telangana Formation Day : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ సాధన ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులను గౌరవంగా స్మరించుకున్నారు. ప్రజల అంకితభావం, త్యాగమే ఈ రాష్ట్ర ఏర్పాటు వెనుక ఉన్న అసలైన శక్తిగా ఆయన కొనియాడారు. తెలంగాణ ప్రజలు కలిసికట్టుగా, ఒకటిగా నిలబడటంతోనే ఈ రాష్ట్రం ఆవిర్భవించింది. ఉద్యమ కాలంలో ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో బాధలు అనుభవించారు. అయినా కూడా నడుం వంచకుండా ముందుకు సాగారు. వారి త్యాగాలను మేమెప్పటికీ మర్చిపోలేం. ఈ రాష్ట్రం ఏర్పడిన 11 సంవత్సరాలు పూర్తయి, ఇప్పుడు 12వ ఏడాదిలోకి అడుగుపెడుతోంది. ఈ సమయంలో మనం గతాన్ని చూసుకోవాలి, భవిష్యత్తు వైపు అడుగులు వేయాలి అని సీఎం అన్నారు.
Read Also: Janmashtami: ఈ ఏడాది కృష్ణ జన్మాష్టమి ఎప్పుడు? ఆరోజు ఏం చేయాలి?
రాష్ట్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. ప్రజల ఆకాంక్షలు, ఆశలు నెరవేరేలా ‘‘తెలంగాణ రైజింగ్’’ అనే నినాదంతో ముందుకెళ్తామని పేర్కొన్నారు. కొత్త తెలంగాణ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని, అన్ని రంగాల్లో ప్రగతిని సాధించేందుకు ప్రభుత్వం కార్యాచరణను అమలు చేస్తున్నదని వెల్లడించారు. మా లక్ష్యం కేవలం అభివృద్ధి కాదు. సామాజిక న్యాయం, సమానావకాశాల కల్పన కూడా అంతే ముఖ్యమైనవి. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, మహిళల సాధికారత వంటి రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి సన్నద్ధంగా ఉన్నాం. గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తాం. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమలను ఆకర్షిస్తున్నాం అని రేవంత్‌రెడ్డి వివరించారు.
తెలంగాణను దేశానికి ఆదర్శంగా మార్చాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని తెలిపారు. అభివృద్ధి అన్ని వర్గాలకూ అందాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, ఇది ఒక గొప్ప కొత్త తెలంగాణ దిశగా మొదటి అడుగుగా అభివర్ణించారు. తెలంగాణ ఆత్మగౌరవానికి, ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచే విధంగా పాలన సాగుతుందని పేర్కొన్న సీఎం, ప్రజల సహకారం, విశ్వాసం కోరుతూ తాము న్యాయపాలనకు కట్టుబడి ఉన్నామని మరోసారి హామీ ఇచ్చారు.