Food checking labs : ఏపీలో ఆహార భద్రత పెంపొందించే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ఆహార భద్రత, ప్రమాణాల నిర్ధారణ కోసం ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI)తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో ఆహారం కల్తీపై పరీక్షలు చేసి నాణ్యత నిర్ధారించేందుకు ల్యాబ్ లు ఏర్పాటు చేయడానికి ఫుడ్ చెకింగ్ సంస్థ అంగీకరించింది. ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సమక్షంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ కేంద్ర కార్యాలయంలో ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం తిరుపతి, కర్నూలులో ఆహార భద్రత, ప్రమాణా నిర్ధారణ కోసం స్పెషల్ ల్యాబ్ లు ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. తిరుపతి లడ్డూ కల్తీ అంశం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారి చివరికి సుప్రీంకోర్టు సైతం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దర్యాప్తు సంస్థను కాదని, సీబీఐతో దర్యాప్తు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.
Read Also: J&K, Haryana Election Results : J&K, హరియాణా ఫలితాల పై కేటీఆర్ రియాక్షన్
ప్రధానంగా ఏపీలో ఆహార పరీక్షల ప్రయోగశాలలు ఏర్పాటు చేసేందుకు ఎఫ్ఎస్ఎస్ఎఐ సుముఖత వ్యక్తం చేసింది. రూ. 20 కోట్లతో తిరుమలలోనూ, మరో రూ.20 కోట్లతో కర్నూలులోనూ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ ల్యాబ్‌లను నెలకొల్పేందుకు ఒప్పందం కుదిరింది. అలాగే ఏలూరు, ఒంగోలులలో ప్రాథమిక ఆహార పరీక్షల ప్రయోగశాలల్ని ఒక్కొక్కటి రూ. 7.5 కోట్లతో మొత్తం రూ.13 కోట్లతో నెలకొల్పనున్నారు. రాష్ట్రంలో ఆహార శాంపిళ్ల సేకరణ, విశ్లేషణ కోసం రూ.12 కోట్లు, ఆహార భద్రతా ప్రమాణాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు రూ.11 కోట్లు కేటాయించేందుకు ఒప్పందం కుదిరింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబరెటరీలతో పాటు అదనంగా మరో 22 ల్యాబరెటరీలను టర్న్ కీ విధానంలో వినియోగించేందుకు రూ.15 కోట్లు కేటాయించేందుకు సూత్రప్రాయంగా అంగీకారం కుదిరింది.