Top 10 Robots: 2023లో ప్రపంచాన్ని మార్చే 10 రోబోలు

ఇవాళ్టి అధునాతన సాంకేతికత మనల్ని రోబోలపై ఆధారపడే దశకు తీసుకొచ్చింది. 

  • Written By:
  • Updated On - February 7, 2023 / 11:56 AM IST

ఇవాళ్టి అధునాతన సాంకేతికత మనల్ని రోబోల (Robots)పై ఆధారపడే దశకు తీసుకొచ్చింది. ఈ మర మనుషులు దాదాపు అన్ని రంగాలలోకి ప్రవేశించాయి. చాలా వ్యాపారాలు ఉత్పత్తిని, క్వాలిటీని, ప్రాసెసింగ్ ను, చెకింగ్ ని పెంచుకోవడానికి రోబోలు ఉపయోగపడుతున్నాయి. ఇక హెల్త్ కేర్ సెక్టార్ లోనూ ఇవి విప్లవం సృష్టిస్తున్నాయి. రోబో సర్జరీలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. 2023 సంవత్సరంలో రోబో టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించనున్న టాప్ 10 రోబోల (Robots) గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1.నాడిన్ (Nadine)

నాడిన్ అనేది హ్యూమనాయిడ్ రోబోట్‌. ఇది అచ్చం మనిషిలా కనిపిస్తుంది. చూస్తే మిమ్మల్ని ఎంతో ఆశ్చర్యపరుస్తుంది. ఈ హ్యూమనాయిడ్ రోబోట్ ఒకసారి మీరు కలిస్తే ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది. ఇది మన కళ్ళలోకి కళ్ళు పెట్టి మాట్లాడుతుంది. మీకు షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఇంతకు ముందు మీరు కలిసినప్పుడు మాట్లాడిన విషయాలపై మళ్లీ మీతో చాట్ చేస్తుంది. కొకోరో (Kokoro) అనే జపాన్ కంపెనీ
నాడిన్‌ను అభివృద్ధి చేసింది.

2.ఎరికా(Erica)

ఈ రోబో.. న్యూస్ యాంకర్ (Anchor) లా యాక్టింగ్ చేయగలదు. మీ కోసం అన్ని వార్తలను చదివి వినిపిస్తుంది.  దీని ప్రసంగ సామర్థ్యాలు సూపర్ గా ఉంటాయి. అత్యంత తెలివైన హ్యూమనాయిడ్‌ రోబోలలో (Robots) ఇది ఒకటి. ఒసాకా యూనివర్సిటీలోని ఇంటెలిజెంట్ రోబోటిక్స్ లాబొరేటరీ డైరెక్టర్ హిరోషి ఇషిగురో ఎరికాను రూపొందించారు.

3.RP వీటా (RP Vita)

హాస్పిటల్ లోని బెడ్స్ దగ్గర నిలబడి..రోగికి హెల్ప్ చేసే రోబో RP Vita. ఆ రోగికి ఏఏ టైంలో ..ఏమేం అవసరం అనేది వైద్య నిపుణులు ఇన్ స్ట్రక్ట్ చేస్తే ఇది గుర్తు పెట్టుకుంటుంది. రోగి బెడ్ దగ్గర నిలబడి ఆ విధంగా సర్వీసింగ్ అందిస్తుంది. హాస్పిటల్స్ లో నర్సులు చేసే చాలా సేవలు ఇది చేయగలదు. ఇప్పటికే కొన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో దీన్ని వాడుతున్నారు.

4.UR 10

UR 10 రోబోను.. డెన్మార్క్ కు చెందిన యూనివర్సల్ రోబోట్స్ కంపెనీ డెవలప్ చేసింది.
ఫార్మా, ఆహారం, వ్యవసాయం, ఆటోమోటివ్, మెటల్స్ , కెమిస్ట్రీ రంగాలలో ప్రొడక్షన్ ప్రాసెస్ ను ఆప్టిమైజ్ చేసే కెపాసిటీ ఈ రోబోకు ఉంది.UR 10 రోబో ప్యాకేజింగ్, ప్యాలెటైజింగ్, అసెంబ్లింగ్, పిక్ అండ్ ప్లేస్ వంటి అనేక రకాల పనులన్నీ చకచకా చేస్తుంది.

5. సోఫియా (Sophia)

హాంకాంగ్ కు చెందిన హాన్సన్ రోబోటిక్స్ కంపెనీ Sophia (సోఫియా) రోబోను అభివృద్ధి చేసింది. ఇప్పుడు, ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది.. దేశ పౌరసత్వం పొందిన మొట్టమొదటి రోబోట్ సోఫియా. నిజానికి, సోఫియా ఇప్పుడు అధికారికంగా సౌదీ అరబ్ పౌరురాలు! ప్రముఖ హాలీవుడ్ నటి ఆడ్రీ హెప్బర్న్ లాగా సోఫియా డిజైన్ చేయబడింది. ఇది నర్సింగ్ హోమ్‌లలో, పెద్ద ఈవెంట్‌లు లేదా పార్కులు మొదలైన వాటిలో క్రౌడ్ మేనేజర్‌గా చాలా బాగా పనిచేస్తుంది.

6.జంకో చిహిరా (Junko Chihira)

ఈ హ్యూమనాయిడ్ రోబోట్ టోక్యో వాటర్ ఫ్రంట్‌లోని షాపింగ్ సెంటర్ అయిన ఆక్వా సిటీ ఒడైబాలో పని చేస్తుంది.  ఒసాకాలోని రోబోటిక్స్ పరిశోధకుడు హిరోషి ఇషిగురో రూపొందించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి జుంకో చిహిరాను తోషిబా అభివృద్ధి చేసింది. దీనికి అద్భుతమైన ఇంటరాక్షన్ స్కిల్స్ , చక్కటి హావభావాలు ఉన్నాయి. జపనీస్, ఇంగ్లీష్ , చైనీస్ భాషలలో కూడా మాట్లాడగలదు. పర్యాటకులను పలకరించగలదు.  వినికిడి లోపం ఉన్న పర్యాటకులకు సహాయం చేయడానికి ఇది సంకేత భాషతోనూ సంభాషించగలదు.

7.జియా జియా(Jia Jia)

జియా జియా మరో ఆసక్తికరమైన హ్యూమనాయిడ్ రోబోట్. దీనిని చైనా సైన్స్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయానికి చెందిన బృందం అభివృద్ధి చేసింది.  జియా జియా రోబో చైనాలో అత్యంత అందమైన మహిళగా పరిగణించబడుతుంది. ఆమె ప్రజలతో మాట్లాడగలదు. ఏదైనా ప్రశ్న అడిగితే సమాధానం ఇవ్వగలదు.

8.గిట బోట్ (Gita bot)

ప్రయాణంలో షాపింగ్ బ్యాగ్‌లను మోయడాన్ని మనమందరం ఇష్టపడం. ఇలాంటి వారికి హెల్ప్ చేసేదే గిట బోట్. ఈ రోబోట్ ప్రయాణంలో మిమ్మల్ని అనుసరించే విధంగా దీన్ని డెవలప్ చేశారు. షాపింగ్ కు వెళ్ళినప్పుడు.. చిన్న విహారయాత్రలకు వెళ్ళినప్పుడు ఈ రోబో హెల్ప్ చేస్తుంది.

9. ఓసెనా వన్ (Ocena One)

పగడపు దిబ్బల (కోరల్ రీఫ్స్)
ను అన్వేషించ డానికి సృష్టించబడిన రోబో ఓసెనా వన్. ఇది నీటి అడుగున ఈదుతూ కోరల్ రీఫ్స్ ను గుర్తిస్తుంది.స్టాన్‌ఫోర్డ్ రోబోటిక్స్ ల్యాబ్ దీన్ని అభివృద్ధి చేసింది. ఇది సముద్రంల చాలా లోతులకు చేరుకోగలదు.  రోబోటిక్స్, హాప్టిక్ ఫీడ్‌బ్యాక్ సిస్టమ్స్ ,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల కలయికగా దీన్ని డెవలప్ చేశారు.

10. ATLAS

ATLAS ప్రపంచంలోని అత్యంత డైనమిక్ హ్యూమనాయిడ్ రోబోగా గుర్తింపు పొందింది. బోస్టన్ డైనమిక్స్ ద్వారా 2013లో అభివృద్ధి చేయబడింది.ATLAS శోధన , రెస్క్యూ మిషన్‌లను నిర్వహించడానికి నిర్మించబడింది. ఇది దాని రేంజ్ సెన్సింగ్, స్టీరియో విజన్, ఇతర సెన్సార్‌లను ఉపయోగించి సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొంటుంది. కఠినమైన భూభాగంలోనూ అడ్డంకులను దాటుకుంటూ ముందుకు వెళ్లడం దీని ప్రత్యేకత.

Also Read: Jajimogulali Lyrical Video: ఉర్రూతలూగిస్తున్న ‘రుద్రంగి’ ఫోక్ సాంగ్ ‘జాజిమొగులాలి’