S Jaishankar : దేశంలో 1975లో విధించిన అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ)కి ఒకే ఒక కుటుంబమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్ పార్టీపై పరోక్షంగా, కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా విమర్శల వర్షం కురిపించారు. ఏకపక్షంగా, స్వార్ధ ప్రయోజనాల కోసం ఎమర్జెన్సీని విధించిన పార్టీకి ఇది రాజ్యాంగం మీద ప్రేమ ఉంటుందని ఎలా నమ్మగలం? అని జైశంకర్ ప్రశ్నించారు. అధికారాన్ని కాపాడుకోవడమే వారి అసలు లక్ష్యం. ఆ సమయంలో దేశ ప్రజల అభిప్రాయాలు, హక్కులు అన్నీ పక్కన పెట్టి, తమ పదవిని నిలబెట్టుకోవడం కోసమే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది అని అన్నారు.
Read Also: Tourism Conclave Program : ప్రతి రంగంలో సంపద సృష్టించాలనేదే నా లక్ష్యం: సీఎం చంద్రబాబు
జైశంకర్ మాట్లాడుతూ, 1975 జూన్ 25న అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ద్వారా ఎమర్జెన్సీ ప్రకటించబడినప్పుడు, ప్రభుత్వ వాదన అంతర్గత భద్రతకు ముప్పు అన్నదని, కానీ అసలైన ఉద్దేశ్యం మాత్రం ప్రజల నిరసనలు, అవినీతి వ్యతిరేక ఉద్యమాల వేధింపుల నుంచి తప్పించుకోవడమేనని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశ ప్రజల ప్రాథమిక హక్కులను పూర్తిగా కాలరాసింది అని వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఆ కాలంలో మీడియా స్వేచ్ఛను పూర్తిగా అణచివేయడమే కాక, దాదాపు లక్షన్నర మందిని విచారణ లేకుండా నిర్బంధించారని జైశంకర్ చెప్పారు. ఇది ఒక చీకటి అధ్యాయం. అందుకే జూన్ 25వ తేదీని ‘సంవిధాన్ హత్య దినంగా’ గుర్తించాల్సిన అవసరం ఉంది అని ఆయన స్పష్టం చేశారు.
ఎమర్జెన్సీ అనేది మనకు ఒక గుణపాఠం. స్వేచ్ఛ అనేది ఇచ్చిపుచ్చుకునే వస్తువుకాదు. దానిని మనం రక్షించాలి, కాపాడుకోవాలి అని అన్నారు. ఆయన పేర్కొన్న విధంగా, నాటి కాంగ్రెస్ పాలనలో పెరిగిన అవినీతి, ద్రవ్యోల్బణం, ప్రజల్లో చీదరింపు ఎమర్జెన్సీకి దారితీసే అంశాలుగా మారాయని తెలిపారు. ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరుగుతున్నా, వారి ఆచరణ మాత్రం రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా ఉందని జైశంకర్ ఎద్దేవా చేశారు. తాము చేసిన చారిత్రక తప్పులపై నేడు కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేయలేదు. తమ తప్పులను అంగీకరించే ధైర్యం వారిలో లేదు అని ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలన్నింటి ద్వారా జైశంకర్, కాంగ్రెస్ పార్టీపై తీవ్రమైన విమర్శలు గుప్పిస్తూ, 1975 ఎమర్జెన్సీని ఒక వ్యక్తి లేదా కుటుంబం ఆధిపత్యపు నిర్ణయంగా అభివర్ణించారు. దేశ ప్రజలకు స్వేచ్ఛ యొక్క విలువను గుర్తు చేసే సందర్భంగా ఈ సందర్భాన్ని పేర్కొన్నారు.
Read Also: Oscars : ఆస్కార్ సినిమాల ఎంపికలో ఓటు వేయనున్న భారతీయ నటులు