Gazette Notification : ఏపీలోని తూర్పు గోదావరి-పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ ఈరోజు విడుదలైంది. ఈ మేరకు డిసెంబర్ 12లోగా ఎన్నిక నిర్వహణ పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ నెల 18 వరకు నామినేషన్ పత్రాలను స్వీకరించనున్నారు. ఈ నెల 19న నామినేషన్లను పరిశీలించనున్నారు. ఇక డిసెంబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 9న ఫలితాలు వెలువడనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ వేయడానికి అవకాశం కల్పించనున్నారు. ఆరు జిల్లాల పరిధిలో 16,316 ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
కాగా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికైన పీడీఎఫ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ గతేడాది డిసెంబరు 15న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో ఈ ఉపఎన్నిక జరుగు తుంది. 2021లో జరిగిన ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజక వర్గం నుంచి పీడీఎఫ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా షేక్ సాబ్జీ ఎన్నికయ్యారు. వాస్తవానికి ఆయన పదవీకాలం 2027, మార్చి 29వతేదీ వరకు ఉంది. రోడ్డుప్రమాదంలో మృతి చెందడం వల్ల ఉపఎన్నిక అనివార్యమైంది. ఇకపోతే..ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఉపాధ్యాయ ఓటర్లు మొత్తం 16,316 మంది ఉన్నారు. మొత్తంగా 116 పోలింగ్ కేంద్రా లను అధికారులు ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఆరు జిల్లాల నుంచి కాకినాడ కలెక్టరేట్‌కు రావాలి. దీనిలో కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాలు ఉన్నాయి.