Drones : నగరంలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ పరిధిలో డ్రోన్ల వినియోగంపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. విమానాశ్రయం చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లను ఉపయోగించరాదని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి వెల్లడించారు. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వచ్చిందని, జూన్ 9వ తేదీ వరకు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రయాణికుల భద్రత, విమానాల రాకపోకలలో అంతరాయం లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని కమిషనర్ తెలిపారు. డ్రోన్ల వినియోగం వల్ల విమానయాన భద్రతకు ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నందున, ముందస్తు జాగ్రత్తగా ఈ నిషేధం విధించినట్లు తెలిపారు. అనుమతి లేకుండా డ్రోన్లు వాడే లపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
Read Also: Act of War : ఇక పై ఎటువంటి ఉగ్రదాడులు జరిగినా ‘యుద్ధ చర్య’గానే పరిగణిస్తాం : భారత్
ఇదిలా ఉంటే, మరోవైపు హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ నగరాల్లో బాణసంచా కాల్చడంపై కూడా నిషేధం విధించబడింది. ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో, ముఖ్యంగా కంటోన్మెంట్ ప్రాంతాల్లో బాణసంచా పేలుళ్లు ప్రజలలో భయాందోళనలు కలిగించే అవకాశం ఉన్నందున, ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఆకస్మిక శబ్దాల వల్ల ఉగ్రవాద చర్యలుగా మినహాయించే ప్రమాదం ఉందని, ప్రజలు అపోహకు గురికాకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నామని సీపీ తెలిపారు. ప్రస్తుతం భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో నగర ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు. పోలీసుల ఆదేశాలను అతిక్రమించిన వారు చట్టపరమైన చర్యలకు గురవుతారని ఆయన హెచ్చరించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా తీసుకుంటున్న ఈ చర్యలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, శాంతి భద్రతల పరిరక్షణ అందరి బాధ్యత అని పోలీసు శాఖ స్పష్టం చేస్తోంది.
Read Also: Ayyanna Patrudu: భారత రక్షణ నిధికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు నెల వేతనం విరాళం