Roja : వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా మరోసారి తన ధాటిగా చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఇటీవల ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ఇంటర్వ్యూలో రోజా మాట్లాడుతూ..జనసేన మరియు టీడీపీ నేతల్లో మగ అహంకారం నిండిపోయింది. కానీ ప్రజల సేవకు మాత్రం వారి సమయం సరిపోవడం లేదు అంటూ మండిపడ్డారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యేగా బాలకృష్ణ ఇప్పటి వరకూ అసెంబ్లీకి ఎంతసేపు వెళ్లారు? అసలు ప్రజల సమస్యలపై ఎన్ని సార్లు పోరాటం చేశారు? అని ఆమె ప్రశ్నించారు.
Read Also: Suresh Raina : సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ క్రికెటర్
నేను మంత్రిగా ఉన్నప్పుడు నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, మహిళా శ్రేయస్సు కోసం తీసుకున్న నిర్ణయాలు అన్నీ ప్రజలకు తెలుసు. మరి పవన్ కళ్యాణ్, బాలకృష్ణ కూడా అసెంబ్లీలో చేసిన పనులను ఒకసారి ప్రజల ముందు చెప్పగలరా? వాళ్లు సిద్ధంగా ఉన్నారా? అంటూ సవాల్ విసిరారు. ప్రజలు వాళ్లను షూటింగ్‌లు చేసుకోడానికి ఓట్లు వేయలేదు. రాజకీయాల్లోకి వచ్చి, పదవులు సంపాదించిన తర్వాత షూటింగ్ స్పాట్ లపై కాకుండా అసెంబ్లీలో కనపడాలి. అదే నిజమైన ప్రజాప్రతినిధి కర్తవ్యం అని రోజా అన్నారు. గతంలో నేను జబర్దస్త్ చేస్తూ పాలకవర్గంలో ఉన్నాను కాబట్టి నన్ను విమర్శించారు.
ఇప్పుడు వాళ్లు సినిమాలు, షోట్‌ల షూటింగ్‌లు చేస్తే మాత్రం ఎలా సరైంది అవుతుంది? ఒకరికి ఒక నియమం, మరొకరికి మరో నియమమా? అని తీవ్రంగా ప్రశ్నించారు. రాజకీయాల్లోకి రావడం వల్ల మీరు ప్రజల కోసం పనిచేయాల్సిన బాధ్యత వుంది. కానీ సినిమా నటుల్లా మాత్రమే ప్రవర్తిస్తే అది బాధ్యతారాహిత్యమే. అసెంబ్లీకి హాజరుకాని నాయకులు ప్రజల సమస్యలను ఎలా పరిష్కరిస్తారు? పదవులు అధికారంగా వచ్చినప్పుడు వాటికి బాధ్యతలు కూడా వస్తాయి. వాటిని నెరవేర్చకపోతే ప్రజలు ప్రశ్నిస్తారు. పవన్ కళ్యాణ్ గారూ, బాలకృష్ణ గారూ ప్రజలకే మీరు మీ సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు షూటింగ్స్ కాదు, సేవ చేసేద్దాం అనేది నా సందేశం అని రోజా తెలిపారు.