Dalai Lama : దలైలామా వారసుడి ఎంపికపై చైనా చేస్తున్న ప్రకటనలపై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 15వ దలైలామా ఎంపిక పూర్తిగా ప్రస్తుత దలైలామా ఆధ్వర్యంలోనే జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయంలో బీజింగ్‌కు ఎలాంటి హక్కులుండవని, టిబెటన్ బౌద్ధ సంప్రదాయాల ప్రకారం ఈ నిర్ణయం పూర్తిగా ఆధ్యాత్మిక నాయకుడైన దలైలామాకు చెందుతుందని భారత ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు గురువారం విడుదల చేసిన ప్రకటనలో దలైలామా పదవి కేవలం టిబెటన్ ప్రజలకే కాదు, ఆయనను అనుసరించే ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులకు ప్రాధాన్యత కలిగినది. వారసుడి ఎంపికలో నిర్ణయాధికారం దలైలామాకే ఉంటుంది అని స్పష్టం చేశారు.
Read Also: Vallabhaneni Vamsi : జగన్ ను కలిసిన వల్లభనేని వంశీ
ఇప్పటికే చైనా ప్రకటించిన భవిష్యత్ దలైలామా తమ ఆమోదంతోనే ఉండాలి అనే వ్యాఖ్యలపై 14వ దలైలామా టెన్జిన్ గ్యాట్సో, అలియాస్ లామా ధోండప్ ఘాటుగా స్పందించారు. టిబెటన్ సంప్రదాయాల ప్రకారం, కొత్త దలైలామా ఎంపిక 600 ఏళ్ల నాటి బౌద్ధ ఆచారాల ఆధారంగా మాత్రమే జరుగుతుందని స్పష్టం చేశారు. దీనిలో చైనా ఎలాంటి పాత్ర పోషించదని, ఈ నిర్ణయం తమ “గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్” ఆధ్వర్యంలోనే ఉంటుందని తెలిపారు. తన 90వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా మెక్లియోడ్‌గంజ్‌లో జరిగిన ఆధ్యాత్మిక సమావేశంలో దలైలామా చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. చైనా ఎంపిక చేసిన ఎవరినైనా తిరస్కరించాలి అంటూ ఆయన బహిరంగంగా చెప్పడం గమనార్హం.
దలైలామా విడుదల చేసిన ప్రకటనలో తదుపరి దలైలామా ఎవరో గుర్తించే హక్కు గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్‌కే ఉంటుంది. ఇది సంప్రదాయపరంగా ధర్మ పరిరక్షకుల సమన్వయంలో జరిగే ప్రక్రియ అని పేర్కొన్నారు. ఆయన మరణానంతరం తమ ఆత్మ మరొక శరీరంలో పునర్జన్మ పొందుతుందని బౌద్ధుల నమ్మకం. ఇప్పటిదాకా దలైలామాల ఎంపిక అదే పద్ధతిలో జరిగింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ మాట్లాడుతూ..భవిష్యత్ దలైలామా ఎంపిక చైనా ప్రభుత్వ ఆమోదంతోనే జరగాలి అని వ్యాఖ్యానించారు. ఇది టిబెటన్ బౌద్ధ సంప్రదాయాలకు విరుద్ధంగా ఉందని భారతం సూటిగా చెప్పింది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ దశాబ్దాలుగా టిబెటన్ మత స్వాతంత్య్రంపై తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని చూస్తుండగా, ఈ తాజా ప్రకటనలు మరోసారి ఉద్రిక్తతను రెచ్చగొడుతున్నాయి.
1959లో టిబెట్ ఆక్రమణ తర్వాత దలైలామా భారత్‌కు ఆశ్రయానికి వచ్చారు. అప్పటి నుంచి ధర్మశాలలో నివసిస్తున్న ఆయన ఉనికి చైనా, భారత్ మధ్య సున్నిత అంశంగా మారింది. భారత్ మాత్రం ఇప్పటికీ టిబెటన్ మతస్వేచ్ఛకు మద్దతుగా నిలుస్తోంది. అమెరికా కూడా ఇదే తరహాలో స్పందించింది. మత స్వేచ్ఛకు హాని కలిగించేలా చైనా జోక్యం చేసుకోవడం మానేయాలని, వారసత్వ వ్యవహారంలో బీజింగ్ నోటికట్టుకోవాలని హెచ్చరించింది. దలైలామా వారసత్వం భవిష్యత్తులో టిబెటన్ ప్రజల హక్కులకు, ప్రపంచంలోని బౌద్ధ మత విశ్వాసాలకు కీలకమవుతుంది.