Covid cases : దేశం మొత్తాన్ని మళ్లీ కరోనా భయం వెంటాడుతోంది. కొంతకాలంగా తగ్గినట్లు కనిపించిన కరోనా వైరస్ కేసులు తాజాగా మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా రాజధాని ఢిల్లీ, దక్షిణాది రాష్ట్రమైన కేరళలో కొత్త కేసుల సంఖ్య మరింత ఆందోళన కలిగించేలా ఉంది. ఢిల్లీలో ఇప్పటికీ 104 మంది కరోనా బాధితులు ఉన్నారు. ఇందులో ఒక్క వారం వ్యవధిలోనే కొత్తగా 99 మందికి కరోనా సోకినట్టు అధికారులు తెలిపారు. దీంతో నగర ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఈ వృద్ధి రేటు చూస్తే మళ్లీ పాత రోజులు మళ్లీ వస్తాయేమో అన్న అనుమానాలు వెలువడుతున్నాయి. ప్రజలు మాస్కులు వేసుకోవడం మొదలుపెడుతున్నారు. ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండమని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Read Also: Southwest Monsoon : తెలంగాణ, ఏపీలను తాకిన ‘నైరుతి’.. రాబోయే 3 రోజులు వానలు
ఇక, కేరళలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. అక్కడ క్రియాశీల కేసులు 400 మార్కును దాటి పోయాయి. ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా వేగంగా కేసులు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. కేరళ ప్రభుత్వం స్థానిక స్థాయిలో నిర్బంధ చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. ప్రజలు మళ్లీ మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం మొదలుపెట్టారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,009 క్రియాశీల కేసులు నమోదయ్యాయి. కేవలం గత వారం రోజుల్లోనే 750 మందికి కొత్తగా కరోనా సోకినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇది గత నెలతో పోలిస్తే రెండింతల వృద్ధి అని అధికారులు పేర్కొన్నారు. మళ్లీ వైరస్ వ్యాప్తి దశను చేరుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా కొద్దిపాటి కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణలో తక్కువ సంఖ్యలో అయినా కొత్త కేసులు బయటపడుతున్నాయి. దీంతో అన్ని రాష్ట్రాల్లో హెల్త్ బులెటిన్లు తిరిగి చురుకుగా విడుదల అవుతున్నాయి. ఆరోగ్య నిపుణులు దీన్ని గమనించాల్సిన హెచ్చరికగా పేర్కొంటున్నారు. వైరస్ ప్రభావం పెద్దగా లేకపోయినా, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముందుజాగ్రత్తగా మళ్లీ పరీక్షలు పెంచాలని, అనుమానాస్పద లక్షణాలుంటే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కేంద్రం ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు పరిస్థితిని పరిశీలిస్తూ, అవసరమైతే ఆంక్షలపై తిరిగి ఆలోచించవచ్చని సంకేతాలు ఇస్తున్నాయి. ప్రజలందరూ బాధ్యతగా వ్యవహరించి, కరోనా నిరోధానికి సహకరించాల్సిన సమయం ఇది.
Read Also: TDP Mahanadu : మహానాడుకు రమ్మంటూ ఎన్టీఆర్ పిలుపు.. ఎఐ టెక్నాలజీతో ప్రత్యేక వీడియో