Corona Case: భారతదేశంలో మళ్లీ కరోనా వైరస్ కేసులు (Corona Case) పెరుగుతున్నాయి. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. మే 2025లో ఈ మూడు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకారం.. దేశవ్యాప్తంగా మొత్తం 257 యాక్టివ్ కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసులు స్వల్ప తీవ్రతతోనే ఉన్నాయని, ఎవరికీ తీవ్ర లక్షణాలు లేవని కేంద్రం తెలిపింది.
కేరళలో కోవిడ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. మొత్తం 95 కేసులతో 69 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ కేసుల్లో ఒక వ్యక్తి మరణించినట్లు కేరళ ఆరోగ్య శాఖ ప్రకటించింది. 27 మంది చికిత్స తర్వాత కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మహారాష్ట్రలో 44 కేసులు, తమిళనాడులో 34 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు ఎక్కువగా స్వల్ప లక్షణాలతో ఉన్నప్పటికీ వైరస్ వ్యాప్తి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
సింగపూర్, హాంకాంగ్‌లలో కరోనా కేసులు వేల సంఖ్యలో పెరుగుతున్నాయి. కానీ అక్కడి రోగులు 7 రోజుల్లో కోలుకుంటున్నారని, లక్షణాలు బలహీనంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య సంస్థలు తెలిపాయి. భారతదేశంలో వ్యాప్తిలో ఉన్న వైరస్ జలుబు, జ్వరం, తలనొప్పి వంటి సాధారణ లక్షణాలను కలిగిస్తోంది. ఇవి ప్రమాదకరం కాదని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ICMR తదితర సంస్థలు పేర్కొన్నాయి. వైరస్ వ్యాప్తి, లక్షణాలను నిశితంగా పరిశీలిస్తున్నామని అధికారులు చెప్పారు.
2024లో కేరళలో 66 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. ఇది దేశంలో అత్యధికం. గతంలో కేరళలో 2022లో ఒక రోజులో 49,771 కేసులు, 140 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం కేసులు తక్కువగా ఉన్నప్పటికీ పరీక్షల సంఖ్యను పెంచాలని, ఆక్సిజన్ బెడ్లు, ఐసీయూ సౌకర్యాలను సిద్ధంగా ఉంచాలని కేంద్రం.. రాష్ట్రాలకు సూచించింది. ప్రజలు మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.