Lalu Prasad Yadav : నవంబర్‌లో జరగనున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేస్తున్నామని రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ స్పష్టం చేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 81 స్థానాలకుగాను 70 స్థానాల్లో జేఎంఎం, కాంగ్రెస్ బరిలో దిగుతాయని జార్ఖండ్ సీఎం ప్రకటించడాన్ని ఆయన తప్పుపట్టారు. మిత్రపక్షాలను సంప్రదించకుండానే జేఎంఎం, కాంగ్రెస్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాయని అన్నారు.
జార్ఖండ్‌లోని మొత్తం 81 స్థానాలకుగాను 70 స్థానాల్లో జేఎంఎం, కాంగ్రెస్ బరిలో దిగుతాయని శనివారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రకటించారు. మిగతా 11 స్థానాల్లో ఆర్జేడీ, వామపక్షాలు లాంటి ఇతర మిత్రపక్షాలు పోటీపడుతాయని చెప్పారు. అయితే ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారనే విషయాన్ని మిత్రపక్షాలతో చర్చించిన తర్వాత ప్రకటిస్తామని అన్నారు. గత ఎన్నికల్లో జేఎంఎం 30, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 1 స్థానంలో గెలిచాయి. సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేశాయి.
కాగా జార్ఖండ్‌లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటే వచ్చే నెలలో పోలింగ్ జరగనుంది. మహారాష్ట్రలోని అన్ని స్థానాలకు ఒకే విడతలో నవంబర్ 20న పోలింగ్ జరగనుండగా.. జార్ఖండ్‌లో మాత్రం నవంబర్ 13, 20 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 23న రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.
Read Also: Delhi : ఢిల్లీ ఐఏఎస్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ ఘటన..రేపు సుప్రీంకోర్టులో విచారణ..!