CM Siddaramaiah: మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) స్కామ్ వ్యవహారంలో గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ తాను దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. తీర్పు పూర్తి కాపీని చదివిన తర్వాతే దీనిపై మాట్లాడతానని తెలిపారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. సెక్షన్ 218 కింద గవర్నర్ జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు పూర్తిగా తోసిపుచ్చిందని.. జడ్జిలు గవర్నర్ ఆర్డర్‌లోని సెక్షన్ 17Aకి మాత్రమే పరిమితమైనట్లు సీఎం పేర్కొన్నారు. విచారణకు వెనుకాడబోనని.. చట్టప్రకారం ఎలా ముందుకెళ్లాలో న్యాయ నిపుణులతో సంప్రదించనున్నట్లు తెలిపారు. మరికొద్ది రోజుల్లో నిజం బయటకు వస్తుందని, 17A కింద విచారణ రద్దవుతుందని తాను విశ్వసిస్తున్నానన్నారు. ఈ రాజకీయ పోరాటంలో రాష్ట్ర ప్రజలు తన వెంటే ఉన్నారని.. వారి ఆశీస్సులే తనకు రక్షణ అని పేర్కొన్నారు.
Read Also: Tirumala Laddu : తప్పు చేసినట్లు నిరూపిస్తే పవన్ బూట్లు తుడుస్తాం – అంబటి రాంబాబు
”చట్టం, రాజ్యాంగాన్ని నేను విశ్వసిస్తాను. ఈ పోరాటంలో సత్యానిదే గెలుపు. బీజేపీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోంది. బీజేపీ, జేడీఎస్‌ల ప్రతీకార రాజకీయాలపై న్యాయపోరాటం కొనసాగిస్తాను. కోర్టుపై నాకు నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, హైకమాండ్.. అందరూ నా పక్షాన నిలబడి న్యాయపోరాటం కొనసాగించాలని ప్రోత్సహించారు. నేను పేదల పక్షపాతిగా సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నందు వల్లే బీజేపీ, జేడీఎస్‌లు రాజకీయ ప్రతీకారానికి పాల్పడ్డాయి. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటివి ఎన్నో ఎదుర్కొని, ప్రజల ఆశీస్సులతో గెలుస్తూ వస్తున్నా. ప్రజల ఆశీస్సులతో ఈ పోరాటంలో విజయం సాధిస్తానన్న విశ్వాసం నాకు ఉంది” అని సిద్ధరామయ్య పేర్కొన్నారు.