Delhi Tour: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు ఆయన ఈనెల 6న ఢిల్లీకి వెళ్లనున్నారు. హోంశాఖ మంత్రి అమిత్ షా ను కలిసి, వరద నష్టం వివరాలను సమర్పించి, కేంద్రం ప్రకటించిన అతితక్కువ వరద సహాయంపై మరోసారి పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలు తీరని నష్టాలను మిగిల్చాయి. వరద నష్టాన్ని అంచనావేయడానికి రాష్ట్రంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రితోపాటు, కేంద్ర ప్రత్యేక బృందం పర్యటించింది. మరోవైపు ఏపీలో కూడా వర్షాలు, వరదల వలన భారీ నష్టాలు సంభవించాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు ఎన్డీఆర్ఎఫ్ వరద సాయం కింద కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా రూ. 1500 కోట్లు తక్షణ సాయం ప్రకటించారు. కానీ వాస్తవంగా తెలంగాణకు అతి తక్కువగా రూ. 421 కోట్లు మాత్రమే కేంద్రం నిధులు విడుదల చేసింది. తెలంగాణలో వరద నష్టం రూ.10 వేల కోట్లకు పైగా లెక్క తేలగా.. కేంద్రం మాత్రం అరకొర సహాయం ప్రకటించింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఎల్లుండి ఢిల్లీ వెళ్ళి మరోసారి వివిధ శాఖల కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వలన కలిగిన నష్టాలను వివరించనున్నారు.
Read Also: Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సుమారు పది నెలలు అవుతుంది. ఇంకా పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ కాలేదు. గత నాలుగు నెలలుగా మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరగుతుంది తప్పా..అది వాస్తవ రూపం దాల్చడం లేదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందని చాలా మంది అనుకున్నారు. కానీ పార్లమెంట్ ఎన్నికలు ముగిసి ఐదు నెలలు అవుతున్నా ..మంత్రి వర్గ విస్తరణ జరుగలేదు. నెలల కొద్ది సమయం గడుస్తున్నా మంత్రివర్గ విస్తరణలో మాత్రం స్పష్టత రావడం లేదు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతి సారి ఇక తమకు మంత్రి పదవి ఖాయం అన్నట్లుగా నేతలు తెగ ఫీలవుతున్నారు. మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా అన్న సమాచారాన్ని అనుయాయుల ద్వారా తెలుసుకుంటున్నారట. ఇలా రేవంత్ ఢిల్లీ వెళ్లిన ప్రతి సారి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న నేతల పరిస్థితి ఇలానే ఉంటుందని సమాచారం. సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లడం , మంత్రి పదవి వస్తుందని నేతలు జిల్లాలో హడావుడి చేయడం పరిపాటిగా మారింది తప్పా మంత్రి వర్గ విస్తరణ మాత్రం జరగడం లేదు.