TG EAPCET Results : తెలంగాణ ఎఫ్‌సెట్ ఫలితాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఉదయం అధికారికంగా విడుదల చేశారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా విభాగాల్లో పరీక్షలు రాసిన లక్షలాది మంది అభ్యర్థులకు ఈ ఫలితాలు ఎంతో ప్రాధాన్యంగా నిలిచాయి. ముఖ్యంగా ఇంజినీరింగ్ విభాగంలో మొదటి 10 ర్యాంకులూ బాలురే సాధించడం విశేషం. అంతేకాదు, మొదటి మూడు ర్యాంకులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు గెలుచుకోవడం గమనార్హం. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడకు చెందిన పల్లా భరత్ చంద్ర ఎఫ్‌సెట్ ఇంజినీరింగ్ విభాగంలో మొదటి ర్యాంకు సాధించగా, నంద్యాల జిల్లా కోనాపురం వాసి ఉడగండ్ల రామ్‌చరణ్‌రెడ్డి రెండో ర్యాంకు, విజయనగరం జిల్లాకు చెందిన హేమసాయి సూర్యకార్తీక్ మూడో ర్యాంకు సాధించారు. తెలంగాణకు చెందిన విద్యార్థులు నాలుగో ర్యాంకు నుంచి పదో ర్యాంకు వరకు స్ధానాలు దక్కించుకున్నారు. హైదరాబాద్ నాచారానికి చెందిన మెండె లక్ష్మీభార్గవ్‌కు నాలుగో ర్యాంకు, మాదాపూర్‌కు చెందిన మంత్రిరెడ్డి వెంకట గణేశ్ రాయల్‌కు ఐదో ర్యాంకు, సుంకర సాయి రిశాంత్‌రెడ్డి ఆరవ ర్యాంకు, రష్మిత్ బండారి ఏడో ర్యాంకు, బడంగ్‌పేట్‌కు చెందిన బనిబ్రత మాజీ ఎనిమిదో ర్యాంకు, కొత్త ధనుష్‌రెడ్డి తొమ్మిదో ర్యాంకు, మేడ్చల్‌కు చెందిన కొమ్మ కార్తీక్ పదో ర్యాంకు పొందారు.
Read Also: Ceasefire Inside Story: పాక్ అణు స్థావరాలపై దాడికి సిద్ధమైన భారత్.. అందుకే సీజ్‌ఫైర్‌కు అంగీకారం
అగ్రికల్చర్ మరియు ఫార్మా విభాగాల్లో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల వివరాలను అధికారులు వెల్లడించారు. మేడ్చల్‌కు చెందిన సాకేత్‌రెడ్డి అగ్రికల్చర్ విభాగంలో మొదటి ర్యాంకు సాధించగా, కరీంనగర్‌కు చెందిన సబ్బాని లలిత్ వరేణ్యకు రెండో ర్యాంకు, వరంగల్‌కు చెందిన అక్షిత్‌కు మూడో ర్యాంకు లభించింది. వనపర్తి జిల్లాలోని కొత్తకోటకు చెందిన సాయినాథ్ నాలుగో ర్యాంకు సాధించగా, మాదాపూర్‌కు చెందిన బ్రాహ్మణికి ఐదో ర్యాంకు, కూకట్‌పల్లికి చెందిన గుమ్మడిదల తేజస్‌కు ఆరవ ర్యాంకు దక్కింది. నిజాంపేటకు చెందిన అఖిరానందన్‌రెడ్డి ఏడో ర్యాంకు, సరూర్‌నగర్‌కు చెందిన భానుప్రకాశ్‌రెడ్డి ఎనిమిదో ర్యాంకు, హైదర్‌గూడకు చెందిన శామ్యూల్ సాత్విక్ తొమ్మిదో ర్యాంకు, బాలాపూర్‌కు చెందిన అద్దుల శశికరణ్‌రెడ్డి పదో ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల సహకారం, ఉపాధ్యాయుల మార్గనిర్దేశకమే ఈ విజయానికి కారణమన్నారు. త్వరలోనే విద్యార్థుల మేధస్సు అభివృద్ధికి మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.