Defamation Case : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ రాష్ట్ర సీఎం ఆతిశీకి భారీ ఊరట లభించింది. ఆమెపై బీజేపీ దాఖలు చేసిన పరువునష్టం పిటిషన్‌ను రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారం కొట్టేసింది. అతిషి చేసిన వ్యాఖ్యలు ప్రత్యర్థి పార్టీని ఉద్దేశించి చేసినవే కానీ, నిర్దిష్ట వ్యక్తులను ఉద్దేశించి చేసినవి కావని కోర్టు పేర్కొంటూ బీజేపీ నేత ప్రవీణ్ శంకర్ కపూర్ వేసిన పరువునష్టం పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.
ఆతిశీ లోక్‌సభ ఎన్నికల సమయంలో ఢిల్లీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. తమ పార్టీలో చేరకపోతే ఈడీను అడ్డుపెట్టుకొని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులను బీజేపీ అరెస్టు చేయిస్తుందన్నారు. ఈ కామెంట్స్‌పై బీజేపీ నాయకులు రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దీనిని విచారించిన న్యాయస్థానం ఆతిశీ వ్యక్తిగతంగా ఏ ఒక్కరినో ఉద్దేశించి ఈ కామెంట్స్ చేయలేదని పార్టీని ఉద్దేశించి మాత్రమే మాట్లాడారని వ్యాఖ్యానించింది.
కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేవారం జరుగనున్న తరుణంలో రౌస్ ఎవెన్యూ కోర్టు ఇచ్చిన రూలింగ్ అటు ఆప్‌కు, ఇటు అతిషికి ఉపశమనం కలిగించిందని చెబుతున్నారు. కల్కాజీ నియోజకవర్గం నుంచి అతిషి రెండోసారి పోటీ చేస్తున్నారు. 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న పోలింగ్ జరుగనుండగా, ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడతాయి.
Read Also: Meerpet Murder Case : మృతదేహంపై అమానుష చర్యలు.. సంచలన విషయాలు వెల్లడించిన రాచకొండ సీపీ