Deputy CM Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈరోజు ప్రజా భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియాలో సమావేశంలో మాట్లాడుతూ..అసమానతలు లేని సమాజ నిర్మాణమే తమ లక్ష్యమని అన్నారు. అన్ని కులాల వారికి సమాన అవకాశాలు కల్పించడం మా ప్రభుత్వ ధ్యేయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన ఇవాళ ప్రారంభమైందని తెలిపారు. రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారమే సర్వే చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు కులగణన చేపట్టామని.. ఈ సర్వే ద్వారా శాస్త్రీయమైన సమాచారం అందుతుందని సమాచారం మయేరకు రాజ్యాంగం పేర్కొన్న సామాజిక న్యాయం అందరికీ అందించడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు.
కాగా, కులగణన సర్వే సమయంలో కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, ధరణి పట్టా పాస్ పుస్తకాలు, రేషన్ కార్డులు సిద్ధంగా ఉంచుకోవాలి. దీంతో సర్వే త్వరితగతిన పూర్తి చేయడానికి ఉపయోగ పడుతుందన్నారు. సర్వే కోసం ఎన్యుమరేటర్లకు అవసరమైన శిక్షణ ఇచ్చి సర్వేకు సిద్ధం చేశామని తెలిపారు.
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. రాష్ట్రంలో కులగణన నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఈ రోజు(బుధవారం) సమగ్ర కుటుంబ సర్వేను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈరోజు నుంచి ఈ నెల 21 వరకు అధికారులు ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వేల్లో భాగంగా మొదటి 3 రోజులు ఇళ్లకు అధికారులు స్టిక్కర్ అంటించనున్నారు. అనంతరం మూడు రోజుల తర్వాత ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమగ్ర కుటుంబ సర్వే కోసం మొత్తం 75 ప్రశ్నలతో కూడిన వివరాలు సేకరించనున్నారు. కాగా ఈ సర్వేను ప్రారంభించిన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. అధికారులు కేవలం ప్రశ్నలు మాత్రమే అడిగి తెలుసుకుంటారని.. ఎవరు.. ఫోటోలు, ఇతర జిరాక్సులు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.