Bomb Threats : కేరళ సీఎం కార్యాలయానికి, సీఎం నివాసానికి బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయా ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్ తో కలిసి క్షుణ్ణంగా తనిఖీలు చేయిస్తున్నారు. సీఎం కార్యాలయం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. గత రెండు వారాలుగా కేరళలోని ప్రభుత్వ కార్యాలయాలకు వరుసగా వస్తున్న బాంబు బెదిరింపు కాల్స్ కలకలం సృష్టిస్తున్నాయి. కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా బెదిరింపు కాల్స్ వచ్చినట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ఆదివారం తిరువనంతపురం విమానాశ్రయానికి, రాజధానిలోని ప్రముఖ హోటళ్లకు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు తెలిపారు.
Read Also: Mayor Election : విశాఖ మేయర్‌గా పీలా శ్రీనివాసరావు
ఇక, సమాచారం అందుకున్న బాంబు, డాగ్ స్క్వాడ్‌లు విమానాశ్రయ టెర్మినల్స్‌లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించగా ఎటువంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేవని..అవి నకిలీ బెదిరింపు కాల్స్‌గా గుర్తించామని పేర్కొన్నారు. గత రెండు వారాల్లో 12 బాంబు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ మే 2న కేరళను సందర్శించి విజింజం అంతర్జాతీయ ఓడరేవు ను జాతికి అంకితం చేయనున్నారు. జూలై 2024లో ఓడరేవు ట్రయల్ రన్ నిర్వహించి డిసెంబర్‌లో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ శనివారం ఓడరేవు ప్రాజెక్టు ఆపరేషన్‌తో పాటు కంట్రోల్ సెంటర్లను సందర్శించారు. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఈ నకిలీ కాల్స్‌పై దర్యాప్తు వేగవంతం చేశామని అధికారులు తెలిపారు.