Site icon HashtagU Telugu

Bharat Rice : కిలో రూ.25కే ‘భారత్ రైస్’.. పేదల కోసం మోడీ సర్కారు ప్లాన్

Rice Prices

Rice Prices

Bharat Rice : భార‌త్ ఆటా, భార‌త్ దాల్‌లను డిస్కౌంట్ ధ‌ర‌ల‌కు ప్ర‌జ‌ల‌కు అందిస్తున్న కేంద్ర సర్కారు ఈ లిస్టులో మరో నిత్యావసర సరుకును చేర్చబోతోంది. అదే బియ్యం !! బియ్యం ధరలు పెరుగుతూపోతున్న ప్రస్తుత తరుణంలో ప్రజలకు అండగా నిలిచేందుకు కీలక నిర్ణయం తీసుకునే దిశగా కేంద్ర సర్కారు అడుగులు వేస్తోంది. కిలో రూ. 25కే డిస్కౌంట్ ధ‌ర‌తో భార‌త్ రైస్‌‌ను దేశ ప్రజలకు అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. భార‌త్ రైస్‌ను కూడా డిస్కౌంట్ ధ‌ర‌కు నాఫెడ్‌, ఎన్సీసీఎఫ్‌, కేంద్ర‌య భండార్ అవుట్‌లెట్స్‌, మొబైల్ వ్యాన్స్ వంటి ప్ర‌భుత్వ ఏజెన్సీల ద్వారా పంపిణీ చేయాలని మోడీ సర్కారు యోచిస్తోంది. ప్రస్తుతం దేశంలో బియ్యం ధ‌ర‌లు స‌గ‌టున కిలోకు రూ. 44కు చేరాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ధరల మంటను ఆర్పేందుకుగానూ కేంద్ర సర్కారు  భార‌త్ రైస్ పంపిణీకి చ‌ర్య‌లు చేప‌డుతోంది. త్వరలోనే వీటిని(Bharat Rice) మార్కెట్లోకి రిలీజ్ చేస్తారని సమాచారం.

We’re now on WhatsApp. Click to Join.

భార‌త్ ఆటా‌ను కిలో రూ. 27.50కు, శ‌న‌గ పప్పును కిలో రూ. 60కు కేంద్రం అందిస్తోంది. ప్రస్తుతం వీటిని 2000కుపైగా రిటైల్ పాయింట్స్‌లో సేల్ చేస్తున్నారు. భార‌త్ రైస్‌ను కూడా ఇదే త‌ర‌హాలో ప్ర‌జ‌ల‌కు చేర‌వేయాలని ప్లాన్ చేస్తున్నారు. తద్వారా దేశంలో ధ‌ర‌ల స్ధిరీక‌ర‌ణ జరుగుతుందని భావిస్తున్నారు. మ‌రోవైపు ఫుడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) సైతం దేశీయ మార్కెట్‌లో బియ్యం ల‌భ్య‌త‌ను పెంచి, ధరలు తగ్గేలా చేసేందుకు ఓపెన్ మార్కెట్ సేల్స్ స్కీమ్ (ఓఎంఎస్ఎస్) కింద రైస్‌ను ఆఫ‌ర్ చేస్తోంది.

Also Read: Heart Vest : గుండెపోటును ముందే పసిగట్టే ‘బనియన్’

అధికారిక లెక్కల ప్రకారం గతేడాది డిసెంబర్ 21 నాటికి బియ్యం రిటైల్ ధర కిలోకు రూ.37.99గా ఉంది. ఈ ఏడాది డిసెంబర్ 20 నాటికి ఇది రూ.43.51కి పెరిగింది. కొన్ని చోట్ల ఇది రూ.50 వరకూ ఉంది. ఈ పెరుగుదల ఎక్కడి వరకూ వెళ్తుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి నెలకొంది. సెప్టెంబర్, అక్టోబర్‌లో ధరలు కాస్త అదుపులోనే ఉన్నప్పటికీ నవంబర్ నుంచి పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికిప్పుడు బియ్యం ధరల్ని తగ్గించాలని తేల్చి చెప్పింది కేంద్రం. లాభాల కోసం ఎవరైనా ధరలు పెంచి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరో నాలుగు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి కీలక సమయంలో బియ్యం ధరలు పెరగడం మోడీ సర్కార్‌కి సమస్యగా మారింది.