Miss World : ప్రపంచ వ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా జరిగే “మిస్ వరల్డ్” పోటీలు ఈ సారి భారతదేశంలో జరుగుతున్న క్రమంలో, అందులో భాగంగా పలు దేశాలకు చెందిన సుందరీమణులు తెలంగాణకు పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గౌరవంగా అతిథ్యమిస్తోంది. ఈ పర్యటన రాష్ట్రానికి పర్యాటక రంగంలో ఓ విశిష్ట గుర్తింపు తీసుకొచ్చే అవకాశం. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా అధికారులు ప్రత్యేక పథకాలు రూపొందించారు. వీరికి రాష్ట్ర చారిత్రక సంపదను పరిచయం చేయడం ద్వారా, తెలంగాణ ప్రత్యేకతను ప్రదర్శించాలనే లక్ష్యంతో ఈ పర్యటనను నిర్వహిస్తున్నారు.
Read Also: India-Pakistan Tension: పాకిస్తాన్‌కు మద్దతిస్తున్న టర్కీకి గుణపాఠం చెప్పాలంటే భారత్ ఈ నాలుగు పనులు చేయాలి..
ఈ నేపథ్యంలో బుధవారం నాడు మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనబోతున్న అందగత్తెలు యునెస్కో వారసత్వ ప్రాముఖ్యత కలిగిన రామప్ప దేవాలయాన్ని సందర్శించనున్నారు. తెలంగాణ ప్రాచీన శిల్పకళకు ప్రతీకగా నిలిచిన ఈ దేవాలయం, సుందరీమణులకు భారతీయ సంస్కృతిని దగ్గరగా పరిచయం చేయనుంది. దేవాలయం పరిసరాల్లో భద్రత, హోస్పిటాలిటీ, ట్రావెల్ వంటి అన్ని ఏర్పాట్లను అధికారులు జాగ్రత్తగా చేపట్టారు. అంతేకాక, ఈ ప్రతిష్ఠాత్మక సందర్బాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో రాష్ట్రంలోని కళలు, సంప్రదాయాలు, వంటకాలు, నృత్య రూపాలు, హస్తకళలు, చారిత్రక కట్టడాల ఘనతను వివరించారు. ప్రపంచ దేశాలకు చెందిన యువతులకు ఇది రాష్ట్రం మీద మక్కువ పెంచే అవకాశం. ఈ సాంస్కృతిక పర్యటన ద్వారా తెలంగాణ పర్యాటక రంగం మరింత ప్రచారాన్ని పొందుతుందని, అంతర్జాతీయ యాత్రలలో రాష్ట్రం ప్రాధాన్యత పొందే అవకాశాలు ఉన్నాయని అధికారులు ఆశిస్తున్నారు. అంతర్జాతీయ హంగులతో సాగుతున్న ఈ కార్యక్రమం, తెలంగాణను ప్రపంచ పటముపై ప్రత్యేకంగా నిలబెడుతుంది.