Bangladesh : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పదవిని కోల్పోయిన అనంతరం తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన ప్రఖ్యాత నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ పదవికి రాజీనామా చేయాలని ఉద్ధేశించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల మధ్య సఖ్యత లేకపోవడమే ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ విషయాన్ని హైలైట్ చేశాయి. ఈ నేపథ్యంలో, నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్ నహిద్ ఇస్లామ్ మాట్లాడుతూ.. యూనస్ రాజీనామా వార్తలు నాకు తెలిసాయి. ఆయనను కలిసి చర్చించాను. తాను రాజీనామాపై ఆలోచిస్తున్నట్లు చెప్పారు. రాజకీయ పార్టీల ఐక్యత లేకుండా తాను ముందుకు సాగలేనని స్పష్టం చేశారు. అయితే దేశ భద్రత, ప్రజాస్వామ్య రక్షణ దృష్ట్యా ఆయన పట్టు వదలకూడదని సూచించాను అని తెలిపారు.
Read Also: Weight Loss Drink: ఈ ఒక్క జ్యూస్ తో ఎంత లావు ఉన్నా సరే సన్నగా నాజూగ్గా మారాల్సిందే.. ఆ జ్యూస్ ఏంటంటే!
ఇటీవల యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్-ఉజ్-జమాన్‌తో యూనస్ మధ్య నెలకొన్న విభేదాలు ముదురుతున్నట్లు సమాచారం. ఎన్నికల నిర్వహణ, సైనిక వ్యవహారాల్లో జోక్యం వంటి కీలక అంశాల్లో ఈ ఇద్దరి మధ్య అభిప్రాయ భిన్నతలు తలెత్తాయి. షేక్ హసీనా రాజీనామా తర్వాత తొలుత వీరిద్దరూ కలిసి పనిచేయనున్నట్టు కనిపించినప్పటికీ, పరిస్థితులు త్వరగా మారిపోయాయి. 2026 జూన్‌లో ఎన్నికలు నిర్వహించాలన్న యూనస్ ప్రకటనపై కొన్ని రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ వ్యాఖ్యల నేపధ్యంలోనే జనరల్ వకార్ మీడియాతో మాట్లాడుతూ, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని డిసెంబర్‌లోగా ఏర్పాటు చేయాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాక, సైనిక వ్యవహారాల్లో తాత్కాలిక ప్రభుత్వం జోక్యం చేయడం సరైంది కాదని కూడా వ్యాఖ్యానించారు.
ఇక, గతేడాది ఆగస్టులో జరిగిన విద్యార్థుల పెద్ద ఎత్తున ఉద్యమం షేక్ హసీనా పదవికి చివరి ముద్ర వేసింది. పదహారేళ్ల పాలన అనంతరం ఆమె రాజీనామా చేసి దేశం విడిచి భారత్‌లో ఓ రహస్య ప్రదేశంలో తలదాచుకున్న సంగతి తెలిసిందే. మహమ్మద్ యూనస్ రాజీనామా చేస్తే, బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వ పాలన మరోసారి సంక్షోభంలోకి వెళ్లే అవకాశం ఉంది. రాజకీయ ఐక్యత లేకుండా ప్రజాస్వామ్య స్థిరత సాధ్యం కాదని ఆయన భావిస్తున్నందునే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.