Additional-Judges : ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తులు ప్రమాణం చేశారు. ఈ మేరకు ఈ ముగ్గురు న్యాయమూర్తులకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో, మొదటి కోర్టు హాల్‌లో మహేశ్వరరావు కుంచెం (కుంచం), తూటా చంద్ర ధన శేఖర్ (టిసిడి శేఖర్), చల్లా గుణరంజన్ లు అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు.
ఈ కార్యక్రమం చాలా సాధారణంగా జరిగింది. ఈ అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్రంలోని అనేక న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షుడు ద్వారకానాధ్ రెడ్డి, హైకోర్టు న్యాయ వాదుల సంఘం అధ్యక్షుడు కె. చిదంబరం, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పి. పొన్నారావు, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ డా. వై. లక్ష్మణరావు, ఇతర రిజిస్ట్రార్లు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు కూడా పాల్గొన్నారు.
కాగా, ఇటీవల ఏపీ హైకోర్టుకు కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు నియమిస్తూ..సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిలతో చర్చించిన తర్వాత వీరిని ఏపీ హైకోర్టులో అదనపు జడ్జిలుగా నియమిస్తున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ‘ఎక్స్’లో వెల్లడించారు. అలాగే, కర్ణాటక హైకోర్టులో అదనపు జడ్జిగా ఉన్న జస్టిస్ సిద్ధయ్య రాచయ్యను అదే హైకోర్టులో శాశ్వత జడ్జిగా నియమించినట్లు తెలిపారు.