Site icon HashtagU Telugu

AP High Court : బోరుగడ్డ అనిల్ కు బిగ్‌ షాకిచ్చిన హై కోర్టు.. !

AP High Court dismisses Borugadda anticipatory bail petition

AP High Court dismisses Borugadda anticipatory bail petition

AP High Court :  ఏపీ హైకోర్టు వైసీపీ నేత, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో అనంతపురం నాలుగవ పట్టణ పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ బొరుగడ్డ అనిల్ హైకోర్టు లో పిటిషన్ వేశారు. ఈ క్రమంలోనే ఆ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. పిటిషనర్ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా అని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసుపై హైకోర్టులో విచారణ జరగగా.. బోరుగడ్డకు నేరచరిత్ర ఉందని, రౌడీ షీట్ కూడా ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు.

అంతేకాక..రెండు కేసుల్లో ఇప్పటికే అతడిపై చార్జిషీట్ దాఖలైందని చెప్పారు. దీంతో హైకోర్టు జడ్జి తీవ్రంగా స్పందించారు. ఇలాంటి వారిని క్షమించడానికి వీల్లేదని, ముందస్తు బెయిల్ ఇవ్వలేమని జడ్జి వ్యాఖ్యానించారు. బోరుగడ్డ పిటిషన్ ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు. మాజీ సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతల అంటకాగుతూ నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ చీఫ్ చంద్రబాబు, ఇతర నేతలపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టాడని వివరించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బోరుగడ్డ ఐదేళ్లపాటు అరాచకంగా ప్రవర్తించాడని పోలీసులు ఆరోపించారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన రాందాస్ అథవాలె అనుచరుడినని చెప్పుకుంటూ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిగా చలామణి అయ్యాడన్నారు.

కాగా, బోరుగడ్డ అనిల్ జగన్ పేరు చెప్పి గుంటూరు నగరంలో దందాలు, దౌర్జన్యాలు చేశాడు. నాటి ప్రభుత్వ అండదండలు ఉండడంతో పోలీసులు నిస్సహాయంగా మిగిలిపోవాల్సి వచ్చింది. జగన్‌కు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడినా చంపేస్తానంటూ బోరుగడ్డ బెదిరింపులకు దిగేవాడు, అసభ్య పదజాలంతో విరుచుకుపడేవాడు. చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్, లోకేశ్ లను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు.

Read Also: Pawars Reunion : ఏకం కానున్న ఇద్దరు పవార్లు ? అజిత్ పవార్ తల్లి కీలక వ్యాఖ్యలు