All Party Meeting: ఈనెల 22 నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో 21న (ఆదివారం) అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించినట్లు సమావేశం. అన్ని పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు ఈ భేటీకి హాజరైనట్లయితే.. ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హాజరుకావడం ఇదే తొలిసారి కానుంది. అయితే, ఈ సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ గైర్హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. జులై 21న ఆ పార్టీ అమరవీరుల దినోత్సవంగా పాటిస్తున్నందున తమ ప్రతినిధులు ఈ భేటీకి హాజరుకావడం లేదని టీఎంసీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జులై 22న మొదలై ఆగస్టు 12 వరకు కొనసాగనున్నాయి. జులై 23న పార్లమెంటు ఉభయ సభల్లో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇటీవల కొత్తగా ఏర్పాటైన 18వ లోక్‌సభ తొలి సమావేశాలు జూన్ 24 నుంచి దాదాపు వారం రోజుల పాటు కొనసాగిన విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో ఉభయసభల్లోనూ అధికార, విపక్షాల మధ్య వాడీవేడీగా వాదనలు కొనసాగాయి. కొద్దిరోజులే సభ కొనసాగడంతో కొత్త సభ్యుల ప్రమాణస్వీకారానికి సగం టైం సరిపోయింది. దీంతో బడ్జెట్ ప్రవేశపెట్టడం కుదరలేదు. అందువల్ల ఈ నెల 23న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పూర్తిస్థాయి బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. దీంతో వరుసగా ఏడుసార్లు బడ్జెట్ సమర్పించిన ఘనతను ఆమె దక్కించుకోనున్నారు. ఇప్పటివరకు వరుసగా ఆరుసార్లు బడ్జెట్ సమర్పించిన ఘనత మొరార్జీ దేశాయ్ పేరిట ఉండగా.. ఆ రికార్డును నిర్మలా సీతారామన్ అధిగమించనున్నారు.