Site icon HashtagU Telugu

AICC meeting : ముగిసిన ఏఐసీసీ సమావేశం..పలు కీలక అంశాలపై చర్చలు

111

AICC meeting concluded..discussions on many important issues

AICC meeting: ఢిల్లీలో జరుగుతున్న ఏఐసీసీ కీలక సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఏఐసీసీ సమావేశంలో ముఖ్యంగా సెబీ, అదానీల అంశంపై ముఖ్యంగా చర్చ జరిగినట్టు సమాచారం. ఈ సమావేశం అనంతరం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) మాట్లాడుతూ..ఈ మోడీ పాలనలో దేశంలో రైలు పట్టాలు తప్పడం అనవాయితీగా మారిందని ఎద్దేవా చేశారు. ఈ వరుస రైలు ప్రమాదాల వల్ల కోట్లాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి విపత్తుల కారణంగా.. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కూడా అందడం లేదని ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో ఆ యా అంశాలను ప్రచారాస్త్రాలుగా మలుచుకుని ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

ఆ క్రమంలో వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వాటితోపాటు సంస్థాగత విషయాలు, జాతీయ ప్రాముఖ్యత కలిగిన వివిధ అంశాలపై పార్టీ శ్రేణులతో మల్లికార్జున ఖర్గే చర్చించారు. సెబి, అదానీల మధ్య అనుబంధంపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అలాగే స్టాక్ మార్కెట్లో చిన్న పెట్టుబడిదారుల నగదు ప్రమాదంలో పడకూడదని పేర్కొన్నారు. ఈ మోడీ ప్రభుత్వం తక్షణమే సెబీ చైర్‌పర్సన్‌తో తన పదవికి రాజీనామా చేయించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. అదే విధంగా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, తగ్గుతున్న గృహ పొదుపు సమస్యలు దృష్టి సారించాలని నిర్ణయించారు. ఇక దేశంలోని రాజ్యాంగంపై దాడి నిరాటంకంగా కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

కాగా, కుల గణన అనేది దేశ ప్రజల డిమాండని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. రైతులకు కనీస మద్దతు ధరకు సంబంధించి చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని ఆ దిశగా కొనసాగిస్తుందన్నారు. మన దేశంలోని యువతలో దేశభక్తి అధికంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో సైనిక దళాల్లో యువత పని చేసేందుకు తీసుకు వచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు. ఈ భేటీలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం హాజరయ్యారు. మరోవైపు ఈ అంశాలను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఎక్స్ వేదికగా పంచుకున్నారు.

Read Also:Shankaracharya : సాధువులను ఎవరూ కించపర్చలేరు.. చేసే పనుల వల్లే వారికి గౌరవం : జడ్జీ

Exit mobile version