TTD : ఇటీవల తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఘటన గురించి కొన్ని ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాలలో అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. సోమవారం తిరుమలలోని తన క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్మన్ బీ.ఆర్ నాయుడు మాట్లాడుతూ.. జనవరి 8వ తేదీన తిరుపతిలో జరిగిన ఘటన అత్యంత దురదృష్టవంతమైన ఘటనగా పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. మృతి చెందిన కుటుంబాలకు, గాయపడిన వారికి సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం పరిహారం అందజేశామని తెలిపారు. టీటీడీ బోర్డు సభ్యులు మూడు ప్రత్యేక బృందాలుగా వెళ్లి మృతుల కుటుంబాలకు చెక్కులను అందించారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా పాల్గొన్నారని.. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సుమారు 31 మందికి చెక్కులు ఇవ్వడం జరిగిందని… మరో 20 మందికి ఇవ్వాల్సి ఉందన్నారు. వారికి మరో రెండు రోజుల్లో చెక్కులను అందజేస్తామన్నారు. తిరుమల అనేది కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయమని తెలిపారు. వార్త ప్రచురణ, ప్రసారం చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు పరిశీలించాలని కోరారు. చేతిలో మీడియా ఉందని ఇష్టానుసారం అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాక..టీటీడీ పాలక మండలికి, అధికారులకు మధ్య విభేదాలు ఉన్నట్లు వస్తున్న వార్తలను బీఆర్ నాయుడు తీవ్రంగా ఖండించారు. అందరూ సమన్వయంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఆ సంఘటన మినహా మిగతా అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పారు. భక్తులు ప్రశాంతంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటున్నారని తెలిపారు.
కాగా.. ఈనెల 8న వైకుంఠ ద్వార దర్శనాల కోసం టీటీడీ తొమ్మిది ప్రాంతాల్లో 90 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ముందుగా గురువారం (జనవరి 10) తెల్లవారుజామున కౌంటర్లు తెరవాలని భావించినప్పటికీ భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో బుధవారం రాత్రికే కౌంటర్లను ఓపెన్ చేయాలని నిర్ణయించింది టీటీడీ. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో మూడు ప్రాంతాల్లో ఒక్కసారిగా గేట్లు తెరుచుకున్నాయి. భక్తులు కౌంటర్ కేంద్రాల వద్దకు దూసుకెళ్లారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది.