YS Sharmila: `మేఘా` లోగుట్టు ష‌ర్మిల‌కే ఎరుక‌!

తెలంగాణ‌లోని రాజ‌కీయ పార్టీల ప‌రిస్థితి విచిత్రంగా ఉంది. ఒక్క ష‌ర్మిల మిన‌హా రాష్ట్రంలోని మేఘా కంపెనీ గురించి ప్ర‌ధాన పార్టీల చీఫ్ లు మాట్లాడ‌డంలేదు.

  • Written By:
  • Updated On - July 26, 2022 / 03:58 PM IST

తెలంగాణ‌లోని రాజ‌కీయ పార్టీల ప‌రిస్థితి విచిత్రంగా ఉంది. ఒక్క ష‌ర్మిల మిన‌హా రాష్ట్రంలోని మేఘా కంపెనీ గురించి ప్ర‌ధాన పార్టీల చీఫ్ లు మాట్లాడ‌డంలేదు. వ‌ర‌ద‌ల్లో ఉన్న ప్రాంతాల‌ను ష‌ర్మిల విజిట్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ చీఫ్ లు ఇప్ప‌టి వ‌ర‌కు క్షేత్ర‌స్థాయికి వెళ్ల‌లేదు. ప్ర‌తిష్టాత్మ‌కంగా కేసీఆర్ చెప్పుకునే కాళేశ్వ‌రం ప్రాజెక్టు బాహుబ‌లి ఇంజిన్లు మునిగిపోయిన‌ప్ప‌టికీ రేవంత్ రెడ్డి, బండి సంజ‌య్ అటు వైపు చూడ‌లేదు. తీర్మార్ మ‌ల్ల‌న్న‌, ష‌ర్మిల మిన‌హా కాళేశ్వ‌రంను సంద‌ర్శించ‌డానికి సాహ‌సం చేయ‌లేక‌పోతున్నారు. ఒక్క కాళేశ్వ‌రం ప్రాజెక్టు మాత్ర‌మే కాదు, తెలంగాణ‌లోని 80శాతం కాంట్రాక్టుల‌ను మేఘా కంపెనీకి ఇవ్వ‌డాన్ని ష‌ర్మిల ప్ర‌శ్నిస్తున్నారు.

`గుప్పెడు ఆంధ్రోళ్ల దోపిడీ కార‌ణంగా తెలంగాణ‌కు అన్యాయం జ‌రిగింది. బ‌డా కాంట్రాక్టుల‌న్నీ వాళ్ల‌వే. సంస్కృతి, సంప్ర‌దాయాలను ధ్వంసం చేశారు. నీళ్లు, నిధులు, నియామ‌కాలు తెలంగాణ వాళ్ల‌కు లేకుండా ఆంధ్రోళ్లు దోచుకుంటున్నారు. బ‌డా కాంట్రాక్ట‌ర్లు అంద‌రూ ఆంధ్రోళ్లు ఉండాలా? త‌రిమి కొట్టాలి. తెలంగాణ ఆత్మ‌గౌర‌వాన్ని నిలుపుకోవాలి.` ఇదీ తెలంగాణ సీఎం కేసీఆర్ ఉద్య‌మ‌కారుడిగా ఉన్న‌ప్పుడు చేసిన వ్యాఖ్యలు. సీన్ క‌ట్ చేస్తే, తెలంగాణ వ‌చ్చిన త‌రువాత ఆంధ్రోళ్లు మాత్ర‌మే తెలంగాణ వ్యాప్తంగా కాంట్రాక్టర్లుగా ఉన్నారు. వాళ్ల‌తోనే కేసీఆర్ లావాదేవీల‌న్నీ జ‌రుగుతున్నాయ‌ని ష‌ర్మిల చెబుతున్నారు. మేఘా సంస్థ‌కు, కేసీఆర్ కు ఉన్న సంబంధాన్ని ష‌ర్మిల బ‌య‌ట‌పెట్టే ప్ర‌య‌త్నం చేశారు. అంతేకాదు, ఆ సంస్థ నుంచి కేసీఆర్‌కు అందుతోన్న వాటాల గురించి నిల‌దీశారు. సుమారు 70వేల కోట్ల‌కు అధిప‌తిగా ఉన్న మేఘా సంస్థ అధినేత కృష్ణారెడ్డి 12వేల కోట్ల జీఎస్టీ డిఫాల్డ‌ర్ అంటూ ఆమె ఆరోపించ‌డం సంచ‌లనంగా మారింది.

Also Read:  Adipurush Vs Mega 154: మెగాస్టార్ వర్సెస్ ప్రభాస్.. సంక్రాంతి రేసులో ‘ఆదిపురుష్, మెగా154’

ఏపీ, తెలంగాణ రాష్ట్రంల్లోని ప్ర‌భుత్వ కాంట్రాక్టుల‌న్నీ దాదాపుగా మేఘా సంస్థ చేస్తోంది. సిఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌మాణం చేసిన త‌రువాత రివ‌ర్స్ టెండ‌ర్ల‌ను పిల‌వ‌డంతో పాటు రీ టెండ‌రింగ్ చేసి మేఘా సంస్థ‌కు ప‌నులు అప్ప‌గించారు. వాటిలో ప్ర‌ధాన‌మైన ప్రాజెక్టు పోల‌వ‌రం. తొలుత ట్రాన్స్ ట్రాయ్ ఆ త‌రువాత న‌వ‌యుగ ఇప్పుడు జ‌గ‌న్ వ‌చ్చిన త‌రువాత మేఘా ఖాతాలోకి పోల‌వ‌రం నిర్మాణం వెళ్లిపోయింది. తెలంగాణ ప్ర‌తిష్టాత్మ‌కంగా చెప్పుకునే కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణం మేఘా కంపెనీ చేసింది. రూ. ల‌క్ష‌ కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేసి నిర్మించిన కాళేశ్వ‌ర ప్రాజెక్టు ఎందుకూ కాకుండా పోతుంద‌ని తొలి నుంచి నిపుణులు నెత్తీనోరు బాదుకున్నారు. కానీ, కేసీఆర్ గుడ్డిగా ముందుకెళ్లారు. సీన్ క‌ట్ చేస్తే, ప్ర‌స్తుతం ఆ ప్రాజెక్టు వ‌ర‌ద నీళ్ల‌లో మునిగిపోయింది. మ‌ళ్లీ వేల కోట్లు ఖ‌ర్చు చేస్తేనే ప‌నికి వ‌స్తుంద‌ని అంటున్నారు. ఇలాంటి అంశాన్ని రేవంత్ రెడ్డిగానీ, బండి సంజ‌య్ గానీ సీరియ‌స్ గా తీసుకోలేద‌న్న అప‌వాదు వాళ్ల‌పై ఉంది.

మేఘా కృష్ణారెడ్డి, వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి కుటుంబ సంబంధాలు ఉన్నాయి. ఉమ్మ‌డి ఏపీకి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత నుంచి మేఘా కంపెనీ మ‌రింత వేగంగా విస్త‌రించింది. ఆనాటి నుంచి వైఎస్ కుటుంబంతో మేఘా కంపెనీకి కుటుంబం సంబంధాలు ఏర్ప‌డ్డాయి. ఆ విష‌యం ష‌ర్మిల‌కు బాగా తెలుసు. అందుకే, ఆ కంపెనీ లోగుట్టును బ‌య‌ట‌పెట్టారు. అయితే, ఏపీలోని మేఘా కంపెనీ ప‌నుల గురించి ఆమె ప్ర‌స్తావించ‌లేదు. కేవ‌లం తెలంగాణ‌లోని 80 శాతం ప్రాజెక్టులు మేఘా కు ఎందుకు ఇచ్చార‌ని మాత్ర‌మే ష‌ర్మిల ప్ర‌శ్నించ‌డాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్రోల్స్ చేస్తున్నారు. ఆ కంపెనీ య‌జమాని, తెలంగాణ ప్ర‌భుత్వ అధికారి కుటుంబ పెళ్లికి చెల్లించిన మొత్తాల‌ను ఇటీవ‌ల ఒక జాతీయ వెబ్ సైట్ కూడా బ‌య‌ట పెట్టింది. ఇంత రాద్దాంత౦ జ‌రుగుతోన్న‌ప్ప‌టికీ ప్ర‌ధాన పార్టీల చీఫ్ లు మాత్రం మౌనంగా ఉండ‌గా, ష‌ర్మిల మాత్ర‌మే మేఘాపై ఎందుకు ప‌దే ప‌దే ప్ర‌స్తావిస్తున్నార‌న్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్‌. ఆ లోగుట్టు పెరుమాళ్ల‌కే ఎరుక‌.!

Also Read:  Baba Ramdev: రూ.4 లక్షలు పెట్టి ఆవును కొన్న బాబా రామ్ దేవ్.. అంత ప్రత్యేకత ఏంటంటే?