Site icon HashtagU Telugu

Telangana Politics: ఎన్నికల సమయంలో నిద్ర లేచిన కేసీఆర్: వైఎస్ షర్మిల

Telangana Politics

New Web Story Copy 2023 08 03t171439.770

Telangana Politics: రోజు ఎదో ఒక రకంగా తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నారు వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ప్రతి అంశాన్ని ఎత్తి చూపుతూ వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్ పై నిత్యం విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలపై తనదైన రీతిలో స్పందించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కి ఎన్నికల సమయంలోనే తానిచ్చిన హామీలు గుర్తుకు వస్తాయని ఎద్దేవా చేశారు. తన నాలుగేళ్ళ పాలనలో గడీల్లో కుంభకర్ణుడిలా మొద్దు నిద్ర పోయి ఎన్నికల సమయంలో నిద్ర లేచారని దుయ్యబట్టారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి, ఓట్ల కోసం అటక మీద దాచిన మేనిఫెస్టో తిరగేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ రైతులను ఓట్లు అడిగే ముఖం లేక రుణమాఫీ చేస్తానని నక్క వినయం ప్రదర్శిస్తున్నారని చెప్పారు. అయితే రైతురుణ మాఫీకి ఆయన వద్ద చిల్లిగవ్వ కూడా లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

బీఆర్ఎస్ బంధిపోట్లకు నాలుగున్నరేళ్లుగా తెలంగాణ సొమ్మంతా దోచుకోవడం, దాచుకోవడానికే సరిపోయింది… ఇక మేనిఫెస్టోలో హామీలు నెరవేర్చడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి.. అందుకే రుణమాఫీకి డబ్బుల్లేక నవంబర్ లో చేయాల్సిన మద్యం టెండర్లను మూన్నెళ్ల ముందే ముంగటేసుకున్నడు. జనాలకు మద్యం తాగిస్తాడట… వచ్చిన సొమ్ముతో రుణమాఫీ చేస్తాడట. సిగ్గుందా ముఖ్యమంత్రి గారు? రేట్లు పెంచి, టాక్స్ పెంచి ప్రజల రక్తం తాగడం చాలదని.. మద్యం తాగించి, మహిళల మంగళసూత్రాలు తెంపి, జనాలను మద్యానికి బానిస చేసి ఓట్లు దండుకోవడమా? కరోనా సమయంలోనూ రాష్ట్రం ఆర్థికంగా దూసుకెళ్లిందని, నిధుల కొరత లేదని ఇన్నాళ్లూ గప్పాలు కొట్టిన దొర.. ఇప్పుడు రుణమాఫీ చేయడానికి కరోనా అడ్డుతగిలిందట అంటూ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు.

ఔటర్ రింగ్ రోడ్డును 7 వేల కోట్లకే లీజుకిచ్చుకున్నరు… ప్రభుత్వ భూములను యథేచ్చగా అమ్ముకుంటున్నరు.. పకడ్బందీగా ఎన్నికల కోసం డబ్బును పోగు చేసుకుంటున్నరు.. మొత్తానికి కేసీఆర్ ఏం చేసినా ఎన్నికల కోసమే చేస్తడు అనే మాట నిలబెట్టుకుంటున్నడు.. నీ పిట్టల దొర ముచ్చట్లను నీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా నమ్మరు. ఓట్ల కోసమైనా ఇచ్చిన హామీలు గుర్తు చేసుకుంటున్న దొర గారు.. అదే చేతితో డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వండి, నిరుద్యోగ భృతి ఇవ్వండి, వరద బాధితులను ఆదుకోండి, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వండి, చట్ట సభల్లో బీసీలకు 33%, మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయండి, ఆగిపోయిన దళిత బంధును,మైనార్టీ బంధును అమలు చేయండి.. బీసీల్లోని అన్ని కులాలకు బీసీ బంధు ఇవ్వండి. ఎన్నికలకు ముందే రెండు దఫాల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చి, మీరు పిట్టల దొర కాదని నిరూపించుకోండి అంటూ వైఎస్ షర్మిల చేసిన హాట్ కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.

Also Read: Cabinet Secretary: మోడీ కేబినెట్ సెక్రటరీ పదవి కాలం పొడిగింపు