Wipro Expansion In Hyderabad: దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బృందం తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తేవడంలో విజయం సాధిస్తోంది. ఇప్పటికే పలు ప్రముఖ కంపెనీలతో ఒప్పందం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో దిగ్గజ కంపెనీ విప్రోతో జతకట్టింది. హైదరాబాద్‌లో విప్రో విస్తరణకు (Wipro Expansion In Hyderabad) తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. గోపనపల్లి క్యాంపస్ లో కొత్త ఐటీ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఐటీ సెంటర్‌తో దాదాపు 5000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి.
విప్రో కంపెనీ హైదరాబాద్లో తమ క్యాంపస్ విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని గోపనపల్లిలో కొత్తగా మరో ఐటీ సెంటర్ నెలకొల్పనుంది. దీంతో అదనంగా 5000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ తో సమావేశమయ్యారు. అనంతరం ఈ కీలక ప్రకటన విడుదల చేశారు.
Also Read: IT Raids : సినీ నిర్మాతలు, డైరెక్టర్లపై మూడో రోజూ కొనసాగుతున్న ఐటీ రైడ్స్
హైదరాబాద్‌లో ఐటీ రంగం వృద్ధిలో విప్రో కీలక భాగస్వామి. విప్రో క్యాంపస్ విస్తరణతో రాష్ట్రంలో సాంకేతిక రంగం మరింత వృద్ధి చెందనుంది. ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగనున్నాయి. కొత్త ఐటీ సెంటర్ రాబోయే రెండు మూడేండ్లలో పూర్తవుతుంది. ప్రభుత్వంతో విప్రో చేసుకున్న ఒప్పందంతో ప్రపంచ ఐటీ పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణ ఖ్యాతి మరింత బలోపేతమవుతుంది.
విప్రో విస్తరణ ప్రణాళికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. విప్రో లాంటి పేరొందిన సంస్థలకు తగిన మద్దతు ఇచ్చేందుకు, వ్యాపారాలకు అనువైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు, అవకాశాలు సృష్టించడానికి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం తమకు ఉత్సాహంగా ఉందని ఈ సందర్భంగా విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ అన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామ్యం పంచుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు విప్రో కంపెనీని ఆహ్వానించారు.