Site icon HashtagU Telugu

Telangana Formation Day : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఒక్క రోజే నిర్వహిస్తారా ? : కేటీఆర్

KTR Interesting Tweet

KTR Interesting Tweet

Telangana Formation Day : సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఒక్క రోజుకే పరిమితం చేస్తారా  అని ఆయన ప్రశ్నించారు. తాము ప్రభుత్వంలో ఉండి ఉంటే నెలరోజుల పాటు సంబరాలు నిర్వహించే వాళ్లమని చెప్పారు. ఇవాళ  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాను కేటీఆర్ ఎగురవేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో  ఆయన మాట్లాడుతూ.. ‘‘ తెలంగాణ ముఖ్యమంత్రి మూర్ఖుడు.. అందుకే  దశాబ్ది ఉత్సవాలను ఆయన ఒక్క రోజుకే పరిమితం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు సైతం జై తెలంగాణ అనలేని మూర్ఖుడు ఈ ముఖ్యమంత్రి’’ అని వ్యాఖ్యానించారు. కనీసం ఈ రోజైనా తన శుభాకాంక్షల సందేశంలో జై తెలంగాణ అనలేని సీఎం రేవంత్ అని పేర్కొన్నారు. ‘‘రేవంత్ రెడ్డి జాక్ పాట్ ముఖ్యమంత్రి.. ఆయనకు తెలంగాణ ప్రజల త్యాగాలు, ఉద్యమం గురించి ఏమాత్రం తెలియదు’’ అని కామెంట్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join

‘‘తెలంగాణ  రాష్ట్ర ఆవిర్భావం జరిగి పది సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మా పార్టీ తరఫున, 60 లక్షల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరఫున తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు. తెలంగాణ సాధన కోసం అనేక త్యాగాలు చేసి..  చివరికి ప్రాణాలు అర్పించిన అమరవీరులందరికీ వందనాలు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. 2001లో మలి దశ ఉద్యమంతో కొత్త విప్లవాన్ని సృష్టించి, చరిత్రను మలుపు తిప్పి, తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షకు పురుడు పోసిన ఘనత కేసీఆర్‌కు మాత్రమే దక్కుతుందన్నారు.  గత దశాబ్ద కాలంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధించిందని కేటీఆర్ చెప్పారు. ‘‘తెలంగాణ ఆచరిస్తది.. దేశం అనుసరిస్తది.. అనే తీరుగా దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలిచింది’’ అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో(Telangana Formation Day) సహకరించిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, యువకులు అందరికీ కేటీఆర్ ఈసందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

Also Read : Earthquake : తెల్లవారుజామున భూకంపం.. రోడ్లపైకి జనం పరుగులు