తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల జరిగిన టెండర్ వివాదం, దానిపై ఆమె కుమార్తె సుస్మిత చేసిన సంచలన ఆరోపణల నేపథ్యంలో, మంత్రి కొండా సురేఖ తన పదవికి రాజీనామా చేయనున్నారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆమెను రాజీనామా చేయాలని సూచించిందని తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన లేకపోయినా, సురేఖకు అత్యంత సన్నిహితులైన నేతలు ఈ వార్తను ధృవీకరిస్తున్నారు. పార్టీ లోపల పెరుగుతున్న అంతర్గత విభేదాలు, ముఖ్యంగా మంత్రులు పొంగులేటి మధుసూదన్‌రెడ్డి, కడియం శ్రీహరి తదితరులతో తలెత్తిన విభేధాలు ఈ పరిణామాలకు దారితీశాయని విశ్లేషకులు చెబుతున్నారు.
Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ అదిరిపోయే శుభవార్త..!
సురేఖ నివాసం వద్ద జరిగిన భద్రతా చర్యల మార్పులు కూడా ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చాయి. హన్మకొండలోని ఆమె ఇంటి వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, పోలీస్ ఔట్‌పోస్ట్‌ను తొలగించడం, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. సాధారణంగా మంత్రి స్థాయి వ్యక్తుల ఇళ్ల వద్ద భద్రతా సదుపాయాలను ఎప్పుడు తగ్గించరు. కానీ ఇప్పుడు ఆ ఏర్పాట్లు తొలగించడంతో, అధికార వర్గాల్లో “ఆమె పదవి ప్రమాదంలో ఉందా?” అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఇదే సమయంలో, కొండా సురేఖ తన కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న ఆరోపణలపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని సమాచారం.
అయితే సురేఖను సులభంగా పదవి నుంచి తొలగించడం కాంగ్రెస్‌కు అంత తేలిక కాదు. ఆమె BC వర్గానికి చెందిన ప్రముఖ నాయకురాలు, వరంగల్ జిల్లా రాజకీయాల్లో బలమైన ఆధారమున్న వ్యక్తి. ఇటువంటి సమయాల్లో ఆమెను పక్కన పెట్టడం పార్టీకి పెద్ద రాజకీయ మైనస్ అవుతుందని అంచనా. ముఖ్యంగా బీసీ ఓటర్లలో ఇప్పటికే అసంతృప్తి పెరుగుతున్న నేపథ్యలో, అధిష్ఠానం నిర్ణయం పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే రాబోయే రోజుల్లో సురేఖ భవితవ్యంపై పార్టీ ఉన్నత నాయకత్వం జాగ్రత్తగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.