Site icon HashtagU Telugu

BRS : కేసీఆర్ సైలెంట్ ఉండడం పార్టీని మరింత ఇబ్బందిలోకి పడేస్తుందా..?

Kcr

Kcr

2023 తెలంగాణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ (BRS) పార్టీకి ఎదురైన ఓటమి అనంతరం, పార్టీ అధినేత కేసీఆర్ (KCR) రాజకీయంగా పూర్తిగా మౌనం వహించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. గతంలో ఉద్యమాలతో ప్రజల మనస్సుల్లో నిలిచిన కేసీఆర్, ఈసారి పార్టీ కార్యకర్తలకు మార్గనిర్దేశం చేయకుండా వెనుకబడిపోవడం శ్రేణుల్లో నిరుత్సాహాన్ని పెంచింది. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై విమర్శలు చేయకపోవడం, పార్టీకి ఎదురవుతున్న సవాళ్లపై స్పందించకపోవడం వల్ల బీఆర్‌ఎస్ బలహీనపడుతోందన్న భావన కొనసాగుతోంది.

Kavithas Letter Issue : కేసీఆర్‌‌తో కేటీఆర్‌ భేటీ.. కవిత లేఖ వ్యవహారంపైనే ప్రధాన చర్చ

కవిత అరెస్టు, కేటీఆర్‌పై టాప్‌టాపింగ్, కాళేశ్వరం అవినీతి ఆరోపణలు వంటి కీలక అంశాలు బీఆర్‌ఎస్ నేతలపై తీవ్ర ఒత్తిడిని కలిగించాయి. అయితే ఈ ప్రతికూల పరిస్థితుల్లోనూ కేసీఆర్ ఒక్కసారి కూడా పార్టీకి భరోసా కలిగించేలా మాట్లాడకపోవడం పార్టీలో గందరగోళానికి దారితీస్తోంది. కవిత కూడా బహిరంగ లేఖ ద్వారా పార్టీ అంతర్గత సమస్యలను ప్రస్తావించడంతో గులాబీ క్షేత్రంలో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. అయినప్పటికీ కేసీఆర్ నుంచి స్పందన రాకపోవడం అనేక కొత్త ప్రశ్నలను తీసుకొస్తోంది.

రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఒక నాయకుడిగా కేసీఆర్ బాధ్యత తీసుకుని పార్టీకి దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది. ఒకే ఓటమితో మౌనంగా ఉండటం నాయకత్వ బలహీనతగా కనిపించవచ్చు. గులాబీ కారు తిరిగి పుంజుకోవాలంటే, కేసీఆర్ తన మౌనానికి ముగింపు పలికి పార్టీ శ్రేణుల్లో నమ్మకాన్ని కలిగించాల్సిన సమయం ఇదే అని విశ్లేషకులు సూచిస్తున్నారు. లేకపోతే పార్టీ భవిష్యత్‌కు ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు.