Group 2 Exam : గ్రూప్-2 ఎగ్జామ్‌పై సస్పెన్స్.. టీఎస్‌పీఎస్సీ కొత్త బోర్డు కొలువుతీరేదెప్పుడు ?

Group 2 Exam :  తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కారణంగా గ్రూప్‌-2 రాతపరీక్షలను(Group 2 Exam)  జనవరి 6, 7 తేదీలకు రీషెడ్యూల్‌ చేసిన సంగతి తెలిసిందే.

  • Written By:
  • Updated On - December 23, 2023 / 12:42 PM IST

Group 2 Exam :  తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కారణంగా గ్రూప్‌-2 రాతపరీక్షలను(Group 2 Exam)  జనవరి 6, 7 తేదీలకు రీషెడ్యూల్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండుసార్లు రీషెడ్యూల్ అయిన ఈ  పరీక్షలను.. మూడోసారి కూడా రీషెడ్యూల్‌ చేస్తారా? యథావిధిగా నిర్వహిస్తారా ? అనే దానిపై సందిగ్ధం నెలకొంది. దీనిపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఈ అంశంపై వారం రోజులుగా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో టీఎస్‌పీఎస్సీ చర్చలు జరుపుతున్నా ఇంకా ఎలాంటి నిర్ణయమూ వెలువడలేదు.

We’re now on WhatsApp. Click to Join.

టీఎస్‌పీఎస్సీ నిబంధనల ప్రకారం ఒక పరీక్ష నిర్వహణ తేదీని ఖరారు చేయాలన్నా, ఉద్యోగ నోటిఫికేషన్‌ రిలీజ్ చేయాలన్నా, పరీక్ష వాయిదా వేయాలన్నా, ఫలితాలు వెల్లడించాలన్నా టీఎస్‌పీఎస్సీ బోర్డు సభ్యుల ఆమోదం అవసరం. ఆ తర్వాతే బోర్డు తీసుకున్న నిర్ణయాలను టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అమలు చేస్తారు. టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి ఆదేశాల మేరకు కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అనంతరం ఛైర్మన్‌ సహా ముగ్గురు సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే వీరి రాజీనామాలు ఇంకా ఆమోదం పొందలేదు. అంటే బోర్డు ఇంకా ఉన్నట్లే లెక్క. రాజీనామా పత్రాలు గవర్నర్‌ కార్యాలయానికి పంపిన వారెవరూ కమిషన్‌కు రావడం లేదు.

Also Read: LIC Jobs : 250 అప్రెంటిస్‌షిప్ జాబ్స్.. ఎల్​ఐసీ ఎంప్లాయీగా మారే ఛాన్స్

ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ బోర్డు సభ్యులు లేకపోవడంతో పరీక్షలపై నిర్ణయాన్ని తీసుకునే అవకాశం లేకుండాపోయింది. ఈనేపథ్యంలో టీఎస్‌పీఎస్సీకి నూతన బోర్డు ఏర్పాటు అత్యవసరంగా మారింది. దానికంటే ముందు టీఎస్‌పీఎస్సీ బోర్డులో ఛైర్మన్‌, ముగ్గురు సభ్యుల రాజీనామాలు ఆమోదం పొందాలి. కొత్త బోర్డు ఏర్పాటుకు ఛైర్మన్‌తో పాటు ఎంతమంది సభ్యులు ఉండాలన్న విషయమై ఇప్పటికే ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీని సంప్రదించింది. ఛైర్మన్‌తో పాటు సభ్యులకు ఉండాల్సిన విద్యార్హతలు, అనుభవ వివరాలను కమిషన్‌ వెల్లడించింది. టీఎస్‌పీఎస్సీ బోర్డులో ఛైర్మన్‌తో పాటు 11 మంది సభ్యులను నియమించుకోవచ్చని తెలిపింది. ప్రభుత్వం కొత్తబోర్డు సభ్యులను నియమించిన తర్వాతే కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లకు కార్యాచరణ మొదలు కానుంది.