Site icon HashtagU Telugu

MLC Elections Vs BRS : ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం.. గులాబీ బాస్ వ్యూహం ఏమిటి ?

Mlc Elections Vs Brs Telangana Brs Boss

MLC Elections Vs BRS : మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికల చుట్టూ ప్రస్తుతం తెలంగాణ రాజకీయం తిరుగుతోంది.  రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో కాంగ్రెస్, బీజేపీ, ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. ఈ నెల 27న కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఖమ్మం, వరంగల్, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో జరిగే ఎన్నికల్లో జయకేతనం ఎగురవేయాలనే కదనోత్సాహంతో ఉన్నాయి.  అయితే వరుసపెట్టి పదేళ్లు రాష్ట్రాన్ని ఏలిన బీఆర్ఎస్ మాత్రం ఈ విషయంలో మౌనం వహిస్తోంది. గులాబీ బాస్ కేసీఆర్ నుంచి అందిన స్పష్టమైన ఆదేశాల మేరకే ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం లేదని తెలుస్తోంది. ఈ ఎన్నికలకు దూరంగా ఉండటమే బెటర్ అని బీఆర్ఎస్ ముఖ్యనేతలకు కేసీఆర్ చెప్పారనే టాక్ వినిపిస్తోంది.  మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కంటే, తదుపరిగా జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలే పార్టీకి చాలా ముఖ్యమని ఆయన దిశానిర్దేశం చేసినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

Also Read :Rs 10 Coins : రూ.10, రూ.20 నాణేలు, నోట్లపై అప్‌డేట్.. రూ.350 నోట్ వస్తుందా ?

‘‘ఇప్పుడొద్దు’’ అంటూ కేసీఆర్..

మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో(MLC Elections Vs BRS) ఈసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను నిలపడం లేదని తెలిసింది. ఇక ఇదే సమయంలో ఎవరికీ పార్టీ తరఫున మద్దతు ఇవ్వొద్దని కేసీఆర్ డిసైడ్ చేసినట్లు చెబుతున్నారు. కొందరు బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తామని కేసీఆర్ ఎదుట ప్రతిపాదించగా.. ఆయన సున్నితంగా ‘‘ఇప్పుడొద్దు’’ అని చెప్పారట. ఈవిధంగా కేసీఆర్‌ను కలిసి టికెట్ కోరిన నేతల్లో కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, చిలుముల రాకేష్ కుమార్, టీఎన్జీవో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రయివేటు విద్యాసంస్థల సంఘం నేత శేఖర్‌రావు ఉన్నారు. వీళ్లందరికీ కేసీఆర్ ముక్కుసూటిగా నో చెప్పగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇందుకు భిన్నంగా కీలక ప్రకటన చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మాజీ మేయర్ రవీందర్‌కు మద్దతుగా నిలవాలని పార్టీ శ్రేణులకు కవిత పిలుపునిచ్చారు.  దీంతో కేసీఆర్ ఆదేశాలను కవిత కూడా పాటించడం లేదా అనే చర్చ మీడియాలో మొదలైంది. ఇక బీఆర్ఎస్‌లో చేరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేద్దామనుకున్న ప్రసన్న హరికృష్ణకు కేసీఆర్ కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదట.

Also Read :Fetus In Fetu : తల్లి గర్భంలోని బిడ్డ కడుపులోనూ పసికందు

కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు, కవిత ఇలాఖాలో.. 

లోక్‌సభ ఎన్నికల తరహాలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓడిపోతే.. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇమేజ్ దెబ్బతింటుందనే ఉద్దేశంతో కేసీఆర్ ఉన్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మరో పరాభవాన్ని రుచిచూడొద్దనే ముందుచూపుతోనే, ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని గులాబీ బాస్ డిసైడ్ అయి ఉంటారని చెబుతున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం పరిధిలోనే కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కవిత ఎమ్మెల్సీగా అక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినా ఈ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్ వెనుకడుగు వేస్తుండటం ఆ పార్టీ దైన్య స్థితికి అద్దం పడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.