Site icon HashtagU Telugu

BJP OBC Card : బిజెపి ఓబీసీ కార్డు తెలంగాణలో వర్కవుట్ అవుతుందా?

Will Bjp Obc Card Work Out In Telangana

Will Bjp Obc Card Work Out In Telangana

By: డా. ప్రసాదమూర్తి

BJP OBC Card work in Telangana? : కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఓబీసీ కార్డు ప్రయోగిస్తుంటే, బిజెపి తెలంగాణలోనే ఎక్కువగా సామాజిక న్యాయం, ఓబీసీ కోటా విషయాలను ప్రస్తావిస్తుంది. హైదరాబాదు లాల్ బహుదూర్ స్టేడియంలో జరిగిన బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ఉపన్యాసం మొత్తం బీసీ కోటా చుట్టూనే తిరిగింది. పదేళ్ల క్రితం దేశంలో తొలి బీసీ ప్రధానిగా తాను పదవీ బాధ్యతలు చేపట్టానని, కేంద్రంలోని తమ ప్రభుత్వంలో 27 మంది ఓబీసీ మంత్రులు, 85 మంది ఓబీసీ ఎంపీలు, బిజెపి (BJP) పాలిత రాష్ట్రాల్లో 365 మంది ఓబీసీ ఎమ్మెల్యేలు, 65 ఓబిసి ఎమ్మెల్సీలు ఉన్నారని ప్రధాని మోడీ ఎంతో గర్వంగా చెప్పుకున్నారు. అంతేకాదు బీసీ నేషనల్ కమిషన్ కు రాజ్యాంగ స్టేటస్ ను కల్పిస్తున్నట్టు, దేశంలో బీసీలు గౌరవప్రదమైన, ఆత్మ నిర్భరతతో కూడిన జీవితాన్ని సాగించేందుకు తాము ప్రవేశపెట్టిన అనేక పథకాలను మోడీ ఏకరవు పెట్టారు. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణలో బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడానికి తమ పార్టీ కట్టుబడి ఉందని చెబుతూ, ఈ విషయంలో ప్రత్యర్థి పార్టీలకు ప్రధాని ఒక సవాలు కూడా విసిరారు.

We’re now on WhatsApp. Click to Join.

ఎవరా బీసీ ముఖ్యమంత్రి?

తమ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి తన ప్రభుత్వానికి సారథి వహిస్తారని ఇప్పటికే బిజెపి (BJP) నాయకులు చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు ప్రధాని కూడా దాన్ని స్పష్టం చేశారు. కానీ ఎవరు ఆ బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థి? ఈ ప్రశ్నకు బిజెపి నాయకుల వద్ద ఉన్న సమాధానం ఏమిటో మనకు తెలియదు. కేవలం ఊహాగానాల మీదే రాజకీయ విశ్లేషకులు, ఇతర పార్టీల నాయకులు ఆధారపడుతున్నారు. ముసుగులో గుద్దులాట లేకుండా ఫలానా నాయకుడు మా బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థి అని స్పష్టంగా చెప్పవచ్చు. కానీ బిజెపి (BJP) నాయకులు ఈ విషయంలో చాలా గోప్యాన్ని పాటిస్తున్నారు. కారణం పార్టీని రాష్ట్రమంతా బలోపేతం చేసి, అధికార బీఆర్ఎస్ పార్టీకి ఏకైక ప్రత్యర్థి పార్టీగా బిజెపిని నిర్మించిన బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగించి ఇప్పటికే చాలా అపవాదును మూటగట్టుకున్నారు. ఈ సమయంలో పార్టీని వదిలి వెళ్ళిపోతున్న కీలక నేతలను దృష్టిలో ఉంచుకొని ఈ విషయంలో అడుగు ముందుకు వేయాలని బిజెపి భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది.

ఒకవేళ బండి సంజయ్ ను తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే పార్టీని అంటిపెట్టుకొని ఉన్న ఈటల రాజేందర్ ఎదురు తిరగవచ్చు. లేదా తనకు ఈ పార్టీలో ఎంత కష్టపడినా ఫలితం దక్కేదిగా లేదని ఆయన ఎన్నికలవేళ కినుక వహించి మౌనం దాల్చవచ్చు. అది ఎన్నికల ఫలితాలపై తీవ్రమైన ప్రభావం చూపించవచ్చు. అలా కాకుండా ఈటల రాజేందర్ ని బిజెపి (BJP) ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందే ప్రకటిస్తే ఇప్పటికే పార్టీలో అధ్యక్ష పదవి నుండి తొలగించబడి ఆత్మన్యూనతాభావంలో ఉన్న బండి సంజయ్ మొండికేసి ముభావంతో ముడుచుకుపోవచ్చు. అందుకే బీజేపీ ఎవరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలా అనే విషయంలో డోలాయమాన స్థితిలో పడిపోయింది.

అటు చూస్తే కాంగ్రెస్ దేశవ్యాప్తంగా బీసీ కార్డు ముందుకు తీసి రాజకీయాల్లో చట్టసభల్లో విద్యా ఉద్యోగాల్లో అన్నిచోట్ల బీసీలకు తగు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. డిమాండ్ చేయడమే కాదు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కులాధార జనగణన సాగిస్తామని కాంగ్రెస్ భరోసా పలుకుతుంది. మరోపక్క బీహార్ లో కులాధార జనగణన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి, రాష్ట్రంలో రిజర్వేషన్ల నిష్పత్తిని 65 శాతానికి పెంచడానికి తాము సిద్ధంగా ఉన్నామని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు. రిజర్వేషన్ల నిష్పత్తి 50% పరిమితిని అధిగమించి 65 శాతానికి పెంచడానికి బీహార్ ప్రభుత్వం నడుం కట్టింది. చట్టారీత్యా సాధ్యాసాధ్యాలు అలా ఉంచితే, రిజర్వేషన్ల విషయంలో ఎవరి నిబద్ధత, నిజాయితీ ఏమిటి అనే విషయంలో ప్రజలకు ఒక స్పష్టత వస్తుంది.

ఈ తరుణంలో సామాజిక న్యాయం పట్ల ఉపేక్ష వహిస్తే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తాము దెబ్బ తింటామని బిజెపి (BJP) ఇప్పుడు బీసీ రాజకీయాలను ముందుకు తెస్తుంది. ఎన్నికలలో వాగ్దానాల మాట ఎలా ఉన్నా ఆచరణలో ఎవరు సామాజిక న్యాయం పట్ల నిబద్ధతతో వ్యవహరిస్తారో ఎన్నికల అనంతరమే దేశానికి తెలుస్తుంది. దేశవ్యాప్తంగా అగ్ర వర్ణాల అండదండలు ఎక్కువగా ఉన్న బిజెపికి ఇప్పుడు పఠిస్తున్న బీసీ మంత్రం నిజంగా అమలు చేసే చిత్తశుద్ధి ఉందా లేదా అనేది ముందు ముందు చూడాలి. తెలంగాణలో బిజెపి ప్రయోగిస్తున్న బీసీ అస్త్రం ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో అప్పుడే చెప్పలేం.

Also Read:  Telangana: కేసీఆర్ హెలికాఫ్టర్ కు మరోసారి సాంకేతిక లోపం