Site icon HashtagU Telugu

Telangana NDA : తెలంగాణలోనూ తెరపైకి ఎన్డీయే కూటమి?

Telangana Nda Alliance Brs Bjp Tdp Janasena Telugu States Andhra Pradesh

Telangana NDA : వైఎస్ జగన్ పాలనా కాలం చివర్లో జరిగిన పరిణామాలు ఏవైనా కావచ్చు.. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు ఏవైనా కావచ్చు.. వచ్చే ఎన్నికల నాటికి ఇక్కడ కూడా ఎన్‌డీఏ కూటమి ఏర్పాటవుతుందనే ప్రచారం మొదలైంది. ఇటీవలే తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ పోల్స్‌లో రెండుచోట్ల బీజేపీ పాగా వేయడమే అందుకు పెద్ద సంకేతమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఒకప్పుడు బీఆర్ఎస్‌కు ఆయువుపట్టు లాంటి ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో.. బీఆర్ఎస్ ముఖ్యుల సహకారం లేనిదే ఈవిజయం బీజేపీకి దక్కిందా ? అనే ప్రశ్న ఉదయించిందని అంటున్నారు.  భవిష్యత్తులో తెలంగాణలో ఏర్పాటయ్యే ఎన్‌డీఏ కూటమికి ఇప్పటి నుంచే సైలెంట్ ట్రయల్స్ మొదలయ్యాయని పలువురు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ, బీఆర్ఎస్‌ల మధ్య గ్యాప్ తగ్గిందని చెబుతున్నారు.

Also Read :1000 Killed : 2 రోజుల్లో 1000 మంది మృతి.. రోడ్లపై డెడ్‌బాడీలు.. సిరియాలో మళ్లీ నరమేధం

బీజేపీతో బీఆర్ఎస్‌కు బలమేనా ?

బీజేపీ(Telangana NDA) బలోపేతం అయితే బీఆర్ఎస్‌కు దీర్ఘకాలంలో నష్టం జరుగుతుందనే లెక్కలు వేసే వాళ్లు కూడా ఉన్నారు. ఈవిషయం రాజకీయ చాణక్యుడు కేసీఆర్‌కు తెలియదా ? ఆయన అంత మాత్రం ఊహించలేరా ? కేసీఆర్‌కు ఈ లెక్కలన్నీ తెలుసు. ఏపీ తరహాలో తెలంగాణలోనూ ఎన్‌డీఏ కూటమి ఏర్పాటుకు ఆసక్తి ఉన్నందు వల్లే.. ఎమ్మెల్సీ పోల్స్‌లో బీజేపీ బరిలోకి దిగినా, బీఆర్ఎస్ ఏమీ పట్టనట్టుగా ఉండిపోయింది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులంటూ ఎవ్వరూ ఉండరు.  బీజేపీ, బీఆర్ఎస్‌లతో రాష్ట్రంలో ఎన్‌డీఏ కూటమి ఏర్పాటైతే, కాంగ్రెస్‌ను ఎదుర్కోవడం ఈజీ అవుతుందని కేసీఆర్ భావిస్తుండొచ్చు. బీజేపీ బలోపేతమైతే, దానితో జతకట్టబోయే తమకూ బలం వచ్చినట్టే అని కేసీఆర్ మనసులో ఉండొచ్చు. చెప్పలేం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణ రాజకీయాలు ఏ మలుపైనా తీసుకోవచ్చు. కాంగ్రెస్‌ను గద్దె దింపేందుకు కేసీఆర్ ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు.

Also Read :Rohit Sharma: చ‌రిత్ర సృష్టించనున్న రోహిత్ శ‌ర్మ‌.. కేవ‌లం అడుగు దూరంలోనే!

టీడీపీ బరిలోకి దిగితే..

గత తెలంగాణ అసెంబ్లీ పోల్స్‌లో టీడీపీ పోటీ చేయలేదు. వచ్చే పోల్స్‌లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అసెంబ్లీ స్థానాలపై టీడీపీ గురిపెట్టే అవకాశం ఉందట. బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ ఏకమైతే.. తప్పకుండా హైదరాబాద్‌లోని అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌కు టఫ్ ఫైట్ ఇవ్వగలవు. ఇక తెలంగాణలోని మిగతా అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. దానికి బీజేపీ తోడైతే సీన్ మారిపోవచ్చు. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే గుర్తించి అలర్ట్ అయితే బాగుంటుందని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు.