Site icon HashtagU Telugu

Pawan Kalyan : పోటీలో ఉన్న పవన్ కళ్యాణ్ ప్రచారం లో ఎందుకు లేడు?

Why Is Pawan Kalyan Not In The Campaign..

Why Is Pawan Kalyan Not In The Campaign..

By: డా. ప్రసాదమూర్తి

Pawan Kalyan : తెలంగాణలో ఎన్నికలకు ఇంకా రెండు వారాలు కూడా సమయం లేదు ఇప్పటికే కాంగ్రెస్, బిజెపి పార్టీలకు సంబంధించిన అగ్ర నాయకులంతా తెలంగాణలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అధికార బీఆర్ఎస్ సరే సరి. మరి బిజెపితో కలిసి తెలంగాణ ఎన్నికలలో పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంతవరకు తెలంగాణలో ఒక ఎన్నికల ప్రచార సభలో కూడా పాల్గొనలేదు. కేవలం ఇటీవల జరిగిన బిజెపి బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినప్పుడు మాత్రమే ఆయన పాల్గొన్నారు. ఆ సభలో కూడా పవన్ కళ్యాణ్ కేవలం నరేంద్ర మోడీ గుణగణాలను కీర్తించి, ఆయన పట్ల తన అపార భక్తిశ్రద్ధలను వ్యక్తం చేసుకున్నారు తప్ప తన ప్రసంగంలో ఎక్కడా ఎన్నికలకు సంబంధించిన ప్రస్తావన ఆయన చేయలేదు.

We’re Now on WhatsApp. Click to Join.

తెలంగాణలో జనసేన పార్టీకి బిజెపి 8 స్థానాలు కేటాయించింది. ఆ స్థానాలు కూడా ఆంధ్రా సెటిలర్లు బాగా ప్రభావం చూపించే అవకాశం ఉన్న స్థానాలే. కాబట్టి బిజెపి ఏ ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో తెలంగాణలో పొత్తు పెట్టుకున్నదో ఆ ఉద్దేశం నెరవేరాలంటే పవన్ కళ్యాణ్ బిజెపితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. అదే మిత్ర ధర్మం. ఈ మిత్ర ధర్మాన్ని పవన్ కళ్యాణ్ పాటిస్తున్నట్టుగా కనిపించడం లేదు. ఆయన ఇంతవరకు ఎక్కడా ఒక ఎన్నికల సభలో కూడా పాల్గొనలేదు. పవన్ కళ్యాణ్ కు తెలంగాణలో కూడా ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ మేరకు ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే కొద్దిగా ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ ఏ ప్రచార సభలోనూ తన చరిష్మా ప్రయోగించి ఓటర్లను తమ వైపు ఆకర్షించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టనేలేదు.

బిజెపి పోటీ చేస్తున్న స్థానాలు మాట అలా ఉంచినా, జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాలలోనైనా పవన్ కళ్యాణ్ ప్రచారం చేయాలి. అది కూడా ఆయన ఇంతవరకు ప్రారంభించలేదు. మరి ఎందుకు ఈ మౌనం? ఏమిటీ నిశ్శబ్దం? అనేదానికి ఆయనే సమాధానం చెప్పాలి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కేవలం మోడీ గాని, కనీసం అమిత్ షా గానీ వస్తే తప్ప మామూలుగా రాష్ట్రస్థాయి నాయకులు పాల్గొనే సభల్లో ఆయన పాల్గొనరని, ఆయన రేంజ్ జాతీయస్థాయి రేంజ్ అని విశ్లేషకులు ఛలోక్తులు విసురుతున్నారు కూడా.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మౌనం పై చాలా సందేహాలు:

తెలంగాణ ఎన్నికల్లో తమ పార్టీకి కేటాయించిన ఎనిమిది స్థానాల్లోనైనా జనసేన అభ్యర్థులను గెలిపించుకోవడానికి, కనీసం విజయం సాధించలేకపోయినా పరువు నిలబెట్టుకునే ఓట్లయినా సాధించడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నాలు కూడా ఆయన చేయడం లేదు. ప్రధాని మోడీ పాల్గొన్న సభలో పవన్ కళ్యాణ్ కేవలం మోడీని కీర్తించారు కానీ ఆయన ఎక్కడా అధికార బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గాని, కేసిఆర్ ని గాని, ఇతర అధికార పార్టీ నాయకుల్ని గాని పల్లెతి మాట అనలేదు. అసలు తెలంగాణ లో ప్రభుత్వ పనితీరు పట్ల ఆయన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయలేదు. అంతే కాదు వేరే మరెక్కడా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన వ్యాఖ్యలు కూడా చేయడం లేదు. ఇదంతా చూస్తుంటే ఆయన బిజెపి ఒత్తిడికి లొంగి తెలంగాణలో పోటీ చేస్తున్నారని భావించడానికే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే తనకు ఇష్టం లేకపోయినా ఇలా తెలంగాణ ఎన్నికల రంగంలో తన పార్టీ అభ్యర్థులను నిలపి, వారికి తగు మోస్తరు సంఖ్యలో ఓట్లను సాధించలేకపోతే దాని ఫలితాలు తమ పార్టీ భవిష్యత్తు మీద ప్రభావం చూపించగలవని అర్థం చేసుకోలేనంత అమాయకత్వంలో పవన్ కళ్యాణ్ ఉన్నారని అనుకోలేం.

అయినా ఎందుకు ఆయన ఇలా మౌనం పాటిస్తున్నారు.. దాని వెనుక ఉన్న వ్యూహం ఏమిటో తెలియడం లేదు. మరోపక్క షర్మిల కాంగ్రెస్ పార్టీకి తన మద్దతును ప్రకటించడం పట్ల బీఆర్ఎస్ నాయకులు తీవ్రమైన పదజాలంతో విమర్శిస్తున్న తీరు చూస్తున్నాం. షర్మిల పోటీ పెట్టకపోయినా కేవలం తన మద్దతును మాత్రమే కాంగ్రెస్కు ప్రకటించినా, కేసీఆర్ లాంటి నాయకులు విరుచుకుపడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో ఒక్క మాట కూడా బీఆర్ఎస్ నాయకులు ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. ఇదంతా చూస్తుంటే ఎక్కడో ఏదో జరుగుతున్నట్టుగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో టిడిపి పోటీ చేయడం లేదు. ఈ విషయంలో చంద్రబాబు ఒక వ్యూహాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. కనుక టిడిపితో ఆంధ్రాలో జనసేనకు పొత్తు ఉంది కాబట్టి జనసేన తెలంగాణలో పోటీ చేస్తే టిడిపి ఓట్లు కూడా జనసేన అభ్యర్థులకు పడే అవకాశం ఉందని, ఆ మేరకు ఆంధ్రా సెట్లర్లు ఓట్లు కాంగ్రెస్ వైపు వెళ్లకుండా కట్టడి చేయవచ్చనే ఒక వ్యూహంతో పవన్ కళ్యాణ్ ని రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది.

కానీ ఈ వ్యూహం మొత్తం మీద పవన్ కళ్యాణ్ కి ఎదురు దెబ్బ తగిలినా ఆశ్చర్యపోనవసరం లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రచారంలో సర్వశక్తులూ వినియోగించి పాల్గొంటారా.. లేదా కంటి తుడుపు చర్యగా పాల్గొంటారా అనేది చూడాల్సి ఉంది. ఎన్నికల ఫలితాల అనంతరం గానీ పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికల విషయంలో తీసుకున్న నిర్ణయం ఆయనకు లభిస్తుందో వికటిస్తుందో తెలియదు. కాలంతో పాటు మనమూ వేచి చూడాల్సిందే.

Also Read:  Ex Minister Jawahar : దళితుడు బొంతు మహేంద్రది ఆత్మాహత్య కాదు.. హోంమంత్రి చేయించిన హత్య – మాజీ మంత్రి జ‌వ‌హ‌ర్‌