Site icon HashtagU Telugu

Shailaja Dies : ‘శైలజ’ మృతికి కారణం ఎవరు..?

Shailaja Dies Of Food Poiso

Shailaja Dies Of Food Poiso

ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై విద్యార్థిని శైలజ (Shailaja) (16) మృతి చెందడం అందరినీ కలచివేస్తోంది. ప్రభుత్వ ఆశ్రమ స్కూలులో చదివి పేదరికాన్ని జయించాలన్న ఆమె కలలు ఛిద్రమయ్యాయి. అక్కడ అందించిన ఆహారం తిని ఆస్పత్రి పాలై, పేదరికంతో కార్పొరేట్ వైద్యానికి నోచుకోలేదు. వైద్యానికి శరీరం సహకరించక ఎంతో భవిష్యత్తును వదిలేసి ఈ లోకాన్ని వీడింది. ఆమె మృతికి కారణం ఎవరు? ప్రభుత్వమా? పేదరికమా? అని ఇప్పుడు అంత ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత కాలంలో తమ పిల్లలను కార్పొరేటు స్కూల్స్ లలో చదివించలేని మధ్యతరగతి ప్రజలు..తమ పిల్లలను ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో చేర్పించితే..ఇలా కలుషిత ఆహారం పెట్టి ప్రాణాలు తీస్తారా అంటూ ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ఎంతోమంది కలుషిత ఆహారం తిని హాస్పటల్ పాలయ్యారని విపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. విద్యార్థిని శైలజ మృతి ఖచ్చితంగా ప్రభుత్వ హత్యే అంటున్నారు.

ఆశ్రమ స్కూలు విద్యార్థిని శైలజ(16) మృతిపై KTR విచారం వ్యక్తం చేశారు. ‘పెద్ద చదువుల కోసం గురుకులాల్లో చేరిస్తే మరో పేద గిరిజన బిడ్డను బలితీసుకుంటివి. 20 రోజులుగా నిమ్స్ చికిత్స పొందుతుంటే కనీసం పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించలేదు. నీ పనితీరుతో అమాయకులు రాలిపోతున్నారు. సీఎంగా నీకు పిల్లల బాధలు పట్టవా? ఎంతమంది బిడ్డలు మరణిస్తే నీ గుండె కరుగుతుంది రేవంత్’ అని Xలో KTR ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి స‌ర్కార్ నిర్లక్ష్యానికి బలైపోయిన వాంకిడి గిరిజన గురుకుల విద్యార్థిని శైలజకు కన్నీటి నివాళి అర్పిస్తున్న‌ట్లు మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ట్వీట్ చేశారు. మీ ప్రాణాలు బలి తీసుకున్న పాపం.. ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని వెంటాడుత‌ద‌న్నారు. శైల‌జ‌ తల్లిదండ్రులకు గుండె కోతను మిగిల్చిండు సీఎం రేవంత్ రెడ్డి. తోటి విద్యార్థులతో ఆడుతూ, పాడుతూ బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన ఆ చిన్నారి.. విషాహారం వల్ల కన్నుమూయటం కలిచి వేస్తున్నది. ప్రభుత్వ నిర్లక్ష్యం అభం, శుభం తెలియని గిరిజన బిడ్డకు శాపంగా మారింది. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చిందని హ‌రీశ్‌రావు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

వాంకిడి గురుకులంలో నాణ్యత లేని భోజనం పెట్టడం పాపం కాగా, అస్వస్థతకు గురైన విద్యార్థులకు సకాలంలో మెరుగైన చికిత్స అందించకపోవడం మరొక పాపం. అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం విద్యార్థిని ప్రాణాల మీదకు తెచ్చింది. నిమ్స్ ఆసుపత్రిలో బిడ్డను పట్టుకొని అక్కడే ఉన్న ఆ తల్లిదండ్రులకు భరోసా ఇవ్వడంలోనూ కాంగ్రెస్ సర్కార్‌ పూర్తి వైఫల్యం చెందింది. చివరకు ఆ అమ్మాయి చావును కూడా దాచి పెట్టాలనే ఉద్దేశంతో, దొంగ చాటున మృతదేహాన్ని తరలిస్తుండడం సిగ్గుచేటు అన్నారు.

Read Also : Balineni Vs Chevireddy : అదానీ అంశం.. చెవిరెడ్డి, బాలినేని వాగ్వాదం