Site icon HashtagU Telugu

Telangana Muslims : తెలంగాణలో ముస్లింల ఓటు ఎటువైపు?

Where Is The Muslim Vote In Telangana..

Where Is The Muslim Vote In Telangana..

By: డా. ప్రసాదమూర్తి

Telangana Muslims : తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఒక్కొక్క ఓటూ పరిగణనలోకి వస్తోంది. వివిధ సామాజిక వర్గాలు, ప్రాంతాలు, మతాలు పునాదిగా ఆయా ఓటర్లను ఆకర్షించడానికి వివిధ రాజకీయ పక్షాలు తమకు తోచిన ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలంగాణలో ముస్లిం మైనారిటీ వర్గం ఓట్లు దాదాపు 20 స్థానాల్లో క్రియాశీలంగా ఉండవచ్చని ఒక అంచనా. ఓల్డ్ సిటీని పక్కన పెడితే తెలంగాణలో ముస్లిం ప్రజల ప్రాబల్యం ఉన్న స్థానాలు దాదాపు 12 పైనే ఉంటాయని మరో అంచనా. అసలే పోటీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికార బీఆర్ఎస్ కి, ప్రతిపక్ష కాంగ్రెస్ కి మధ్య కేంద్రీకృతమై ఉన్న ఈ తరుణంలో ఒక్క స్థానం కూడా ప్రభుత్వ ఏర్పాటు లో కీలకపాత్ర పోషించవచ్చు. అందుకే తెలంగాణలో ముస్లిం ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారు అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మతపరమైన రాజకీయాలు చేస్తూ నానాటికి ముస్లిం వర్గాన్ని టార్గెట్ చేసుకొని పైకి ఎగబాగుతున్న బిజెపికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ముస్లిం మైనారిటీ ప్రజలు పోలరైజ్ అయి ఉన్నారు.

We’re Now on WhatsApp. Click to Join.

కానీ ఈ పోలరైజేషన్ లో కొన్ని కీలకమైన రాష్ట్రాల్లో ఎంఐఎం ఎన్నికల బరిలోకి దిగి మైనార్టీ వర్గాల్లో కొంత గందరగోళాన్ని నెలకొల్పింది. దేశవ్యాప్తంగా హిందుత్వ కార్డు మీద రాజకీయాలు చేస్తున్న బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాలు ఏకమవుతున్న నేపథ్యంలో, ఎంఐఎం ఒంటెద్దు పోకడతో కొన్ని కీలకమైన రాష్ట్రాల్లో పోటీకి దిగడం వల్ల బిజెపి వ్యతిరేక ఓట్లు చీరిపోతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఎంఐఎం గెలవకపోయినా బిజెపి వ్యతిరేక ఓట్లు చీల్చడం ద్వారా ఆ మేరకు ప్రతిపక్షాలకు నష్టం, బిజెపికి లాభం చేకూరుతోంది. అందుకే ఎంఐఎంని బిజెపికి బి-టీమ్ గా ప్రతిపక్షాలు వర్ణిస్తున్నాయి. ఇది దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ దృశ్యం. ఇప్పుడు తెలంగాణలో ముస్లిం ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారనేది కీలక అంశంగా మారింది. ఎంఐఎం అధికార బీఆర్ఎస్ తో స్నేహ సంబంధాల్లో ఉంది.

అంతేకాదు కాంగ్రెస్ పార్టీ మీద, ఆ పార్టీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి మీద ఎంఐఎం తీవ్రంగా విరుచుకుపడుతోంది. రేవంత్ మీద కాషాయం రంగు పులమడానికి కూడా బీఆర్ఎస్ తో పాటు ఎంఐఎం కూడా గొంతు కలుపుతోంది. ఈ వాతావరణం లో ముస్లింలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అనేది రాజకీయ విశ్లేషకుల అంచనాకు కూడా అందడం లేదు.

ముస్లింలు (Telangana Muslims) అందరూ ఎంఐఎం గొడుగు కిందే ఉన్నారా?

దేశంలో ఉన్న హిందువులంతా హిందుత్వ పార్టీల గొడుగు కింద లేరు. కానీ తెలంగాణలో ముఖ్యంగా జంట నగరాల్లో ముస్లిం ఓటర్లు ఎంఐఎం గొడుగు కింద ఎక్కువగా సమీకరించబడుతున్నట్టు గత ఎన్నికల చరిత్ర మనకు చెబుతోంది. కానీ ఇటీవల పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ పాత బస్తీని మినహాయించి ఇతర ప్రాంతాల్లో ఉన్న ముస్లింలు పునరాలోచనలో పడినట్లు అర్థమవుతుంది. 70 సంవత్సరాలుగా ఈ దేశంలో ఎవరైతే సెక్యులర్ భావాలకు కట్టుబడి ఉన్నారో ఆ పార్టీకి తమ వర్గం ఓట్లు వేస్తుందని జమాయిత్ ఉలామాకు చెందిన మత పెద్దలు తాజాగా ఒక ప్రకటన చేసారు. మౌలానా మహమూద్ మదాని గ్రూపుకు చెందిన జమాయిత్ ఈ ప్రకటన చేయడం తో తెలంగాణలో ముస్లింలు ఎంఐఎం ఆదేశాల మేరకే ఓట్లు వేయరని ఒక స్పష్టమైన సంకేతం అందుతుంది. అందునా తెలంగాణలో అధికార బీఆర్ఎస్ తో బిజెపి అంతర్గతంగా పొత్తు కొనసాగిస్తుందని.. బిజెపి, బీఆర్ఎస్ కాంగ్రెస్ను ఓడించడమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నాయని, ఆ రెండు పార్టీల ప్రచారం ద్వారా ప్రజలకు అర్థమవుతుంది.

ఎన్నికల అనంతరం బీఆర్ఎస్, బిజెపి రెండూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఆశ్చర్యం లేదు. అందునా గతంలో అధికార బిఆర్ఎస్ ముస్లిం సముదాయానికి చేసిన వాగ్దానాలు నెరవేర్చలేదని అసంతృప్తి మైనార్టీ వర్గంలో ప్రబలంగా ఉంది. ముస్లిం రిజర్వేషన్ గానీ, ముస్లిం సాంప్రదాయక మతపరమైన ఆస్తుల పరిరక్షణ విషయంలో గానీ అధికార బిఆర్ఎస్ తగిన చర్యలు తీసుకోలేదన్న వ్యతిరేకత మైనారిటీ వర్గాల్లో ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా లౌకిక భావాలవైపు నిలిచి ఉంది అన్న అభిప్రాయం మైనార్టీ వర్గాల్లో గట్టిగా ఉంది. తాజాగా జమాయిత్ ఉలామా చేసిన ప్రకటన ద్వారా కూడా ఇదే అర్థమవుతుంది. తాము చేసిన సూచనలను సలహాలను కాంగ్రెస్ పార్టీ ఆమోదించిందని, వాటిని తమ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చేర్చిందని జమాయిత్ కు చెందిన మత పెద్దలు ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ తాజా పరిణామాన్ని చూస్తే తెలంగాణలో ముస్లిం ఓటర్లు ఖచ్చితంగా లౌకికతకు పట్టం కట్టే పార్టీ వైపే ముగ్గు చూపుతారని అర్థమవుతుంది. అంటే ఎంఐఎం ఆదేశాల మేరకే ముస్లింలు కట్టుబడి ఓట్లు వేస్తారని చెప్పలేం. తమ ఆశలు, ఆకాంక్షలు ఎవరు నెరవేరుస్తారో, తమ ఉనికిని కాపాడడానికి ఎవరు కట్టుబడి ఉంటారో వారికి ముస్లింలు ఓట్లు వేస్తారని అర్థమవుతుంది. దీన్ని బట్టి చూస్తే ఈ ఎన్నికలు ఎంఐఎం నాయకులకు కూడా ఒక పెద్ద గుణపాఠం కాగలవని ఊహించవచ్చు. ముస్లింలలో ఈ తిరుగుబాటు తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.

Also Read:  Telangana: ఎన్నికలపై కార్తీక మాసం ఎఫెక్ట్.. తగ్గిన మందు పార్టీలు, అభ్యర్థులు ఫుల్ జోష్!