Bapu Ghat : హైదరాబాద్‌లోని ‘బాపూ ఘాట్’ వద్దనున్న మూసీ నది పరివాహక ప్రాంతాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడంపై సీఎం రేవంత్ సర్కారు ఫోకస్ పెట్టింది. గోదావరి నది నుంచి మళ్లించే నీటితో పాటు మూసీ, ఈసీ నదుల నీరు బాపూ ఘాట్ వద్ద కలుస్తుంది. అందుకే దీన్ని త్రివేణి సంగమంగా అభివృద్ధి చేయాలని యోచిస్తున్నారు. బాపూ ఘాట్(Bapu Ghat) వద్ద మూసీ ప్రాంత అభివృద్ధి కోసం 222.27 ఎకరాల రక్షణ శాఖ భూమిని తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ చేయాలని ఇటీవలే రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను సీఎం రేవంత్ కోరారు. త్వరలోనే ఆ భూములను రాష్ట్ర సర్కారుకు అప్పగిస్తారని తెలుస్తోంది. బాపూ ఘాట్ వద్ద వివిధ ప్రభుత్వ సంస్థలకు చెందిన 34 ఎకరాల భూమి ఉంది. 40 ఎకరాల దాకా పట్టా భూమిని సేకరించాల్సి ఉంది. బాపూ ఘాట్ వద్ద, ఘాట్ నుంచి ఎగువ ప్రాంతాల్లో భూసేకరణ కోసం రూ.800 కోట్ల దాకా ఖర్చవుతుందని అంచనా. అందుకే బాపూ ఘాట్ వరకు ఒక సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను, ఎగువన ఇంకో డీపీఆర్‌ను వేర్వేరుగా తయారు చేయనున్నారు.
Also Read :Eturnagaram Encounter : ఏటూరునాగారం అడవుల్లో ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు హతం
ఇక బాపూ ఘాట్ వద్ద జరగనున్న నిర్మాణాల విషయానికి వస్తే.. 300 అడుగుల ఎత్తు కలిగిన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తారు. అతిపెద్ద వీల్ ఆఫ్ లైఫ్ ఏర్పాటవుతుంది. సింగపూర్‌లోని ప్లైయర్ జెయింట్ వీల్ ఎత్తు 165 మీటర్లు. దుబాయ్‌లోని ఐ జెయింట్ వీల్ ఎత్తు 250 మీటర్లు. మన హైదరాబాద్‌లో నిర్మించబోయే వీల్ ఆఫ్ లైఫ్ ఎత్తు వాటి కంటే ఎక్కువే ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. బాపూ ఘాట్ వద్ద ‘త్రికోణ’ పేరుతో అంతర్జాతీయ స్థాయి ధాన్య కేంద్రం ఏర్పాటవుతుంది. ట్రినిటీ పేరుతో వెల్‌నెస్ విలేజ్‌ను నిర్మిస్తారు. బ్రిడ్జ్ ఆఫ్ రికవరీ, బ్రిడ్జి ఆఫ్ డిస్కవరీలను కూడా నిర్మిస్తారు. త్వరలోనే ఈ ప్రతిపాదిత నిర్మాణాల వివరాలతో డీపీఆర్ రెడీ అవుతుంది. బాపూ ఘాట్ పరిధిలో ఏయే చోట ఏయే నిర్మాణాలు జరుగుతాయనే సమాచారాన్ని అందులో ప్రస్తావించనున్నారు.